ఆదివారాల్లోనూ విధులంటే మాసిన బట్టలెవరు ఉతుకుతారు..?!


Ens Balu
267
visakhapatnam
2025-06-13 14:12:32

ప్రభుత్వ ఉద్యోగమంటే వారికేం.. నెల అయ్యే సరికి టంచనుగా జీతం వస్తుంది. ప్రతీ ఆరు నెలలకు ఒక ఇంక్రిమెంటు వస్తుంది.. ఆపై ఐదేళ్లకొకసారి పీఆర్సీ వచ్చి జీతం పెరుగుతంది. అసలు, సిసలు లక్ అంటే అనుకుంటారు అంతా. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో వేళా పాలా లేని విధులు, కనీసం వారంతంలో ఒక్కరోజు కూడా సెలవు లేనితనం, సెలివిచ్చినా ఇంటిదగ్గర కూర్చొని కూడా చేసేంత పని ఇవ్వడం ప్రభుత్వం ఇపుడు పరిపాటి అయిపోయింది. పురుషులకైతే పెరిగిన గెడ్డం, మాసిన తల కటింగ్ చేయించుకోవడానికి ఖాళీ ఉండటం లేదు. మహిళా ఉద్యోగులకైతే ఆదివారాల్లో మాసిన బట్టలు సైతం ఉతుక్కోవడానికి సమయం దొరకడం లేదు. అదేమంటే రాష్ట్రప్రభుత్వంలో పేరుకి, పేపరు మీద మాత్రమే రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగరోజులు, ప్రత్యేక రోజులు సెలవు రోజులు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా సెలవులుగానే నమోదు చేసి ఉంటాయి. 

కానీ వీరికి వారమంతా పనే వుంటుంది. ఒక్కోసారి అదనంగా పనిచేయాల్సి వస్తే ఏ సమయంలో కార్యాలయంలో కూర్చొని పనిచేయాలో వారం రోజులు ముందుగానే వీడియో కాన్ఫరెన్సు, టెలీ కాన్ఫరెన్సు పెట్టి చెప్పేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి కుటుంబాలు, పనులు ఉండావా ఉంటాయి. కానీ ప్రభుత్వానికి, ప్రజలకి మాత్రం కావాల్సిన సమయానికి పనులు చేయాలి. ప్రజలకు నిరంతరం పనులు చేస్తూ పోతే.. వీరికెప్పుడు సెలవులు రావాలి..? అంటే వస్తాయ్ కేవలం కాగితాలపైనే. రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖలు, 26 జిల్లాల్లోని లక్షల మంది ఉద్యోగులను రాష్ట్రప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూస్తామని ఎప్పుడూ బాకాలు ఊదే ప్రభుత్వం ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేసిందో ఆలోచిస్తే.. అసలు విషయం తెలుసిసొస్తుంది అంటున్నారు ఉద్యోగులు. నిజంగా ప్రభుత్వం ఉద్యోగులకు సంక్షేమం చేయాలనుకుంటే.. ప్రభుత్వ సెలవు దినాల్లో పనులు పురమాయించకుండా.. అదనపు విధులు ముందుగానే అప్పగించకుండా ఉందే అదే ప్రభుత్వ ఉద్యోగులకు అసలైన సంక్షేమం చేసినట్టుగా బావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. 

ప్రభుత్వానికి నచ్చినట్టుగా వేళా పాలా, సెలవు దినాల్లోనూ అదిరించి, బెదిరించి పనులు చేయించుకుంటున్నా.. ఉద్యోగులకు మాత్రం వారి సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు,  ఇంక్రిమెంట్లు, ఖాళీల్లో సిబ్బంది నియమాకాలు మాత్రం చేపట్టడం లేదు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగి అయినా సాధారణ ప్రజలు మాదిరిగా వారి తరహాలో వారు ఆందోళన చేస్తే తప్పా వారి సమస్యలు పరిష్కారినికి నోచుకోవడం లేదు. నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి ఐఏఎస్ అధికారి వరకూ ఇపుడు ఖాళీకూడా లేకుండా పనులు పురమాయిస్తున్నది ప్రభుత్వం. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో అవినీతి పెరిగిపోవడానికి కూడా రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇంట్లో కుటుంబాలతో వారంలో ఒక్కరోజు కూడా గడపలేని ప్రభుత్వం ఉద్యోగం చేసి ప్రజలకి ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి కాదు అన్నట్టుగా చేసిన పనికి.. అందునా వేగంగా చేసే పనులకు లంచాలకు అలవాటు పడుతున్నారు. వినడానికి, చదవడానికి వింతగా ఉన్నా ఇది పక్కా నిజం. కనీసం వారాంతంలోనైనా సెలవు ఇవ్వకపోతే ఇంట్లో మాసిన బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలంటూ వాపోతున్నారు. 

అంతేకాదు  పేరుకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విధులు అని చెబుతున్నా, ప్రతీరోజూ ఏడు, ఎనిమిది వరకూ చేయాల్సి పనులు కార్యాలయాల్లో ఉంటున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. భారీగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీచేయకపోవడంతో ఉన్న సిబ్బందే మిగిలిన పనులను వంతుల వారీగా వేసుకొని మరీ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులను 26 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలు చేపట్టినా.. ఇతర శాఖల ఉద్యోగుల కంటేవీరికి మరీ అప్పగించేస్తున్నది రాష్ట్రప్రభుత్వం. మరీ పనులు లేకుండా జీతాలు ఎలా ఇస్తారనే డౌట్ మీకు రావొచ్చు.. వీరితో విధినిర్వహణ సమయంలో పనులూ చేయించేసి.. అదనపు పని గంటలుగా సర్వేలు, ఆన్ లైన్ వివరాల నమోదులంటూ ఊరిమీదకి వదిలేస్తున్నారు. ఆ సమయంలో పనిచేసేందుకు మొబైల్ ఫోన్లు గానీ, ఇంటర్నెట్ గానీ ప్రభుత్వం ఏమీ మంజూరు చేయడంలేదు. 

అలాగని పనిచేయకపోతే బెదిరింపులు, అదిరింపులు, షోకాజ్ నోటీసులు.. ఈ మధ్య మరో అడుగు ముందుకేసి నెలలో రెండు మూడు రోజులు జీతాలు కటింగ్ చేయడం, కార్యాలయాలకి పిలిపించుకొని ప్రత్యేకంగా సమయం తీసుకొని మరీ తెలుగులో ఉన్న బూతులన్నీ తిట్టడం అబ్బో ఒకటి కాదు రెండు కాదు చాలా వ్యవహారాలే జరుగుతున్నాయంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియవని బావిస్తున్నారా అంటే.. అన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఇన్ని పనులు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించి చేస్తున్నారు కదా.. ఉద్యోగులకు సకాలం ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇస్తున్నారంటే.. ఇది రాష్ట్రప్రభుత్వం అలాంటివి ఉద్యోగులు అడక్కూడదు.. ఇచ్చినపుడు మాత్రమే తీసుకోవాలని మాత్రం తెలివి సమాధానమిస్తున్నది ప్రభుత్వం. పోనీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లు అయినా కాస్త ముందుకి వచ్చి పరిష్కరిస్తారా అంటే అవి కూడా కాగితాలకే పరిమితం అవున్నాయి.

 భారతదేశంలోనే ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సర్వీసు రూల్స్, ఉద్యోగికి క్యాడర్, ప్రమోషన్ ఛానల్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.  అలాంటి నూతన సంస్క్రుతికి తెరతీసిన ఘనత కూడా గత ప్రభుత్వానికి దక్కుతుంది. దానిని కొనసాగిస్తున్న కీర్తి ప్రతిష్టలు కూటమి ప్రభుత్వానికే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతా చేసి ప్రభుత్వ ఉద్యోగులు 12నెలల్లో ఒక నెల జీతం ఇన్కం టాక్స్ లుగా ప్రభుత్వానికే చెల్లించేస్తారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. కొందరు జిల్లా అధికారులైతే రెండు నెలల జీతం కూడా ఐటి రిటర్న్స్ సమయంలో సమర్పించాల్సి వుంటుంది.

ఇంత చేసినా, ఏడాదికి నెల, రెండు నెలల జీతం కోల్పుతున్నా, సమయానికి ఇంక్రిమెంట్లు గానీ, పదోన్నతులు గానీ రాకపోయినా.. ఖచ్చితంగా ఆదివారాలు, రెండం శనివారాలు, ఇతర ప్రత్యేక శెలవు రోజుల్లోకూడా పనిచేయాల్సిందే. మేము ఇవ్వాల్సినవి చట్టపరంగా ఇవ్వడం కుదరదు కానీ.. మేము చెప్పినట్టుగా సెలవుల్లో పనులు చేయకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని మాత్రం ఆదేశాలిస్తున్నది రాష్ట్రప్రభుత్వం.(ఇక్కడ మహిళా ఉద్యోగుల ప్రధనా సమస్యలపై రాయకూడని విషయాన్ని ప్రస్తావించలేకపోతున్నాం.. కానీ కొందరు మహిళా ఉద్యోగులు మాత్రం బహిరంగంగానే ప్రభుత్వ తీరుని చాలా దారుణంగా ఎండగడుతున్నారు. ఈ విధానం మంచిది కాదని మండి పడుతున్నారు)