ఆంధ్రప్రదేశ్ సర్కారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు చేపడుతున్న బదిలీలకు ఓ లెక్కుంది.. ఆ లెక్కలోనే కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి.. ఆ చిక్కుముడులు విప్పే నాధుడు మాత్రం లేడు సరికదా.. బాధితులుగా మారిన మహిళా పోలీసులు వారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.. ఐదేళ్లు దాటిన వారిని ఖచ్చితంగా స్థాన చలనం చేస్తామని ప్రకటించిన సర్కారు.. క్లస్టర్ విధానం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సచివాలయాల్లో మహిళా పోలీసు పోస్టులను రద్దు చేసింది.. అలాగని వారికి ఖాళీలున్న స్థానాల్లో కూడా పోస్టింగ్ ఇవ్వలేదు.. వీరిని గాల్లోనే ఉంచి ఇపుడు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో ఉన్న స్థానాలన్నీ భర్తీ జరిగిపోతే.. రద్దైపోయిన పోస్టుల్లో ఉన్నవారిని ఎక్కడ నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఎలాంటి విధి విధానాలు జిల్లా కలెక్టర్లకు కూడా రాలేదు. దీనితో వీరి సమస్య ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనని పరిస్థితి నెలకొంది..!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇపుడు కొందరు మహిళా పోలీసులు గాల్లో ఉన్నారు.. రాష్ట్రప్రభుత్వం ఇటీవల క్లస్టర్ విధానం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మహిళా పోలీసు పోస్టులను సచివాలయాల నుంచి తొలగించింది. ఎంతమందిని తొలిగించారో ఆ జాబితా కూడా గ్రామ సచివాలయాలకు సంంధించి ఎంపీడీఓ కార్యాలయాలకు, వార్డు సచివాలయాలకు సంబంధించి జోనల్ కార్యాలయాలకు పంపింది. అలా రద్దైన పోస్టుల్లో ఉన్నవారికి ఖాళీలు ఉన్నట సచివాలయాల్లోనూ భర్తీచేయలేదు. అలాగని వారిని ఏ ప్రభుత్వ శాఖకు పంపిస్తారో కూడా చెప్పలేదు. ఈ లోగా వచ్చిన సాధారణ బదిలీలు వీరిని కలవర పాటుకి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం రద్దైన మహిళా పోలీసులు క్లస్టర్ లో కలిసేందుకు వీలుగా కొన్ని సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అక్కడ కూడీ వీరిని నియమించలేదు. ప్రస్తుతం ఐదేళ్లు దాటిన వారంతా బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అలా చేసుకున్నవారికి ఖాళీలను బట్టి ఆయ స్థానాలు ఆన్ లైన్ లో చూపించాల్సి వుంటుంది.
అలాగని పోస్టులు రద్దు చేసిన వారిని ఏం చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇందులో కొందరు మహిళా పోలీసులు బదిలీలపై వచ్చి విధుల్లో చేరారు. అలా చేరిన వారిలో కూడా కొంత మంది రద్దైన పోస్టుల్లో ఉన్నారు. అలాగని వీరు క్లస్టర్ లో కలిసే సచివాలయాల్లోని ఖాళీ పోస్టుల్లో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలన్నా వీరికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇపుడు వీరేం చేయాలో తెలియక ఆందోళన పడుతూ తమకు న్యాయం చేయాల్సిందిగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అధికారుల ముందు ఈ విషయాన్ని పెడితే తమకు కూడా ఎలాంటి విధి విధానాలు లేవని.. ముందు ఐదేళ్లు దాటిన వారికి మాత్రం బదిలీలు చేస్తామని చెబుతుండటంతో మహిళా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదేళ్లు దాటిన మహిళా పోలీసులందరూ బదిలీలకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరికి బదిలీలు చేపడితే గాల్లో ఉన్న మహిళా పోలీసులకు మళ్లీ పోస్టింగ్ లు ఇవ్వడానికి కూడా ఖాళీలు ఉండవు.
ఉన్నా ఎక్కడ ఏ జిల్లా చివరన ఉన్న స్థానాలు ఇస్తారో కూడా తెలియడం లేదని మహిళా పోలీసులు వాపోతున్నారు. అలాగని క్లస్టర్ విధానం ఇంకా మొదలు కాలేదని చెబుతున్నా.. క్లస్టర్ పరిధిలోకి వచ్చే సచివాలయాల్లో కైనా తమకు పోస్టింగులు ఇవ్వలేదని చెబుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నామని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఒక నిర్ధిష్ట సమాచారం లేకపోతే ప్రస్తుతం పోస్టులు రద్దై జాబితాలు వచ్చిన మహిళా పోలీసులకు బదిలీల అనంతరం ఎక్కడి స్థానాలు దక్కుతాయో తెలియని పరిస్థితి. ప్రతస్తుతానికి గాల్లో ఉన్న మహిళా పోలీసులు తమ ఇబ్బందులను ప్రజాప్రతినిధులకు తెలియజేద్దామంటే విశాఖజిల్లాలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా అధికారులు అందరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారని, తమ పరిస్థితి ఏంటో తమకు అర్ధం కవాడం లేదని వాపోతున్నారు.
కాగా ఈ విషయమై ఈరోజు-ఈఎన్ఎస్ విశాఖజిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. అయినప్పటికీ సచివాలయ మహిళా పోలీసులు పడుతున్న ఇబ్బందులను.. క్లస్టర్ విధానంలో పోస్టులు రద్దైన వారి సాంకేతిక సమస్యలను జిల్లా కలెక్టర్ చరవాణి దృష్టికి సమాచారాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధి చేరవేశారు. విశాఖజిల్లాలో యోగాంధ్రా కార్యక్రమం పూర్తయ్యేవరకూ ఏఒక్క ప్రభుత్వ అధికారి గానీ, ప్రజాప్రతినిధిగానీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఈలోగా ఇప్పటికే మహిళా పోలీసులు ఇచ్చిన వినతులపై ఏమైనా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందేమోనని మహిళా పోలీసులు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.