గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు.. నిరసనలతో మొదలై.. పెన్ డౌన్ వరకూ తీసుకెళ్లే కార్యాచరణకు సిద్దపడు తున్నా రు..ఆరేన్నరేళ్లుగా కనీసం సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఇవ్వకపోగా.. నేడు క్లస్టర్ విధానంతో పోస్టులను కుదించి ఉద్యోగులను గాల్లోనే తమను పెట్టి నేడు సాధారణ బదిలీలు చేపడుతున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్దమవుతు న్నారు..ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వ శాఖలుంటే 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులు వారికి శాఖలకు చెందిన విధులు మాత్రమే నిర్వహి స్తుంటే.. ఒక్క గ్రామవార్డు సచివాలయశాఖ ఉద్యోగులు మాత్రం మిగిలిన అన్ని ప్రభుత్వశాఖల విధులు చేయాల్సి వస్తున్నది.. ఆఖరికి కార్యాల యంలోని స్టేషనరీ ఖర్చులు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇవ్వకుండా ఒకేసారి నాలుగైదు సర్వేలు సొంత ఖర్చులతో చేయడం, వేళా పాలా లేకుండా అదనపు విధులు అప్పగించడం.. కనీసం వారంతంలో కూడా సెలవులు ఇవ్వకుండా.. ఇచ్చినా ఇంటి దగ్గర కూడా ప్రశాం తంగా లేకుండా అదనపు పనులు చెబుతున్న విధానాలపై ఉద్యోగులు ఒంటి కాలిపై లేస్తూ నేడు రాష్ట్రవ్యాప్త నిరసనకు సిద్దమయ్యారు..!
భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చూడని ప్రభుత్వ శాఖను ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే చూడవచ్చు. ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులకు వారి శాఖ పనుల కంటే మిగిలిన శాఖల పనులు, సర్వేలు, ప్రభుత్వ పథకాల పంపిణీ మొత్తం వీరే చేసే విధులుంటాయి. ఇవన్నీ చేసినందకు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరికైనా దిమ్మ తిరిగి కళ్లు బైర్లుకమ్మాల్సిందే.. ప్రభుత్వ నిర్ధేశించిన సర్వేలు సమాయినికే చేసేయాలంటారు.. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇవ్వరు.. రేషన్ కార్డులు, ఆధార్ కార్డ్, ఓటరు కార్డు, ఇతర పథకాలకు ప్రజలచేత దరఖాస్తులు చేయించ మంటారు కార్యాలయంలో స్టేషనరీ ఇవ్వరు.. ఆ ఖర్చులనే ఉద్యోగులనే పెట్టుకోమంటారు.. కార్యాలయాల్లో పాడైన ప్రింటర్లు బాగు చేయించరు.. వాటిని కూడా ఉద్యోగుల ఖర్చుతోనే బాగుచేయించుకోమంటారు.. చీటికి మాటికి మండల కేంద్రాలు, జోనల్ కార్యాలయాల్లో సమావేశాలకు రమ్మంటారు టీఏ డీఏలు ఇవ్వరు కానీ కార్యాలయానికి పిలిచి అమ్మనా బూతులతో చీవాట్లు, తిట్ల పురాణం మొదలెడతారు..పైగా షోకాజ్ నోటీసులు ఫ్రీ.. వార్నింగ్ లు ఆపై బోనసులే.. ప్రతీ నెలా పించన్లు ఉదయం పదగంటలకే ఇచ్చేయాలి.. అంటే ఉద్యోగులు తెల్లవారుజామున ఐదు గంటలకే విధులకు వెళ్లాలి.. సర్వేలు చేయాలి ఆ యాప్ లన్నీ విచిత్రంగా ఉద్యోగుల విధులు సాయంత్రం 5గంటలకి అయిపోతే ఆరో గంట నుంచి పనిచేయడం మొదలు పెడతాయి..
సమయానికి సర్వే రిపోర్టులు పర్శంటేజీలు రాకపోతే మండల అధికారులకి, జోనల్ అధికారులకి మనిషికొచ్చినంత కోపం వచ్చేస్తుంది.. ఆపై తెగ ఫీలపై ప్రెస్టేషన్ అంతా ఉద్యోగులపైనే చూపించేస్తారు.. కార్యాలయాలు చెత్తా చెదారంతో నిండిపోతే మహిళా ఉద్యోగులైతే చీపుర్లు పట్టుకొని వారే ఊడ్చుకోవాలి.. మగవాళ్లైతే చెత్తను బయట పారేయాలి.. ఆయాలు, చెత్త ఊడ్చే పనివారు ఉండరు.. మాత్రం పనులు చేసుకోలేరా.. పైగా అది మంచి ఎక్స ర్ సైజు ఉచిత సలహాలు ఇస్తారు.. పెట్టిన ఖర్చులకి బిల్లులు పెడితే ఆ ఒక్కటీ అడక్కు అంటారు. ఇంతలా అధికారులు ప్రోత్సహించినా చచ్చో చెడో విధులు నిర్వహిస్తే వీడియో కాన్పరెన్సు, టెలీ కాన్ఫరెన్సు కాల్స్ లో పేరు పేరునా తిట్ల దండకం, పరువు తీయడం... అక్కడికీ అధికారులు జేబులో డబ్బులు జీతాలుగా సచివాలయ ఉద్యోగులకు ఇచ్చేస్తున్నట్టు.. పాపం వారే ఉద్యోగాలు దయతలచి ఇచ్చినట్టు, ప్రభుత్వంలో ఏశాఖలోనూ లేని అధికారిగా తానే ఉన్నట్టు ఫీలైపోతుంటారు ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే..
ఇక రెండో వైపు చూస్తే.. ఆరున్నరేళ్లుగా కనీసం ఉద్యోగులకు పదోన్నతులు కల్పించని ప్రభుత్వశాఖగా గిన్నీస్ రికార్డు కూడా సంపాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖ అయిన గ్రామ, వార్డు సచివాలయశాఖ. ప్రభుత్వశాఖ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, క్యాడర్, ప్రమోషన్ ఛానల్ లేకుండా ఇన్నేళ్లు ఏ విధంగా పనులు చేయించారనే విషయం తెలిస్తే వార్త చదువుతున్నవారికే కాదు.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు కూడా గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, జ్యాబ్ క్యాడర్, ప్రమోషన్ ఛానల్, పీఆర్సీ ఫుల్ బెనిఫిట్స్ , నోషల్ ఇంక్రిమెంట్లు, సర్వీసు రెగ్యులరైజేషన్ ఇంక్రిమెంట్లు.. ఇవ్వాలంటే ముందుగా ఈ ప్రభుత్వ శాఖకు చట్టబద్ధత కల్పించాలి. అలా కల్పించాలంటే అసెంబ్లీలో ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ రావాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు గడిపేసింది. రెండేళ్లు దాటినా ఉద్యోగాలు రెగ్యులర్ చేయకపోతే.. మీడియాలో వచ్చిన వరుస కథనాలతో పరువుపోతుందని భావించి రెండు సంవత్సరాల తొమ్మిదినెలలకు గానీ గత ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసుని రెగ్యులర్ చేయలేదు. ఆ సమయంలో 9నెలల పేస్కేలు ఉద్యోగులకు నష్టం కలిగించి, సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కూడా కోత విధించింది.
అంతేకాదు పీఆర్సీ ఇస్తున్నామని చెప్పి పేస్కేలు పెంచి ఇతర ప్రయోజనాలు ఎగ్గొట్టింది.. ఆ తరువాత సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ పాచికనే చక్కగా, పక్కాగా ఫాలో అవుతోంది. కనీసం సచివాలయ శాఖకు చట్టబద్దత కల్పించేందకు ఇన్నిసార్లు జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో ఒక్కసారి కూడా వీరి అంశాలను చేర్చలేదు. అలా చేర్చి అసెంబ్లీలో చట్టబద్దత కల్పిస్తే ఖచ్చితంగా ఐదేళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగులకు వీరందరికీ పదోన్నతులు ఇవ్వాలి. అలా ఇస్తే ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, పెంచిన పేస్కేలు అమలు చేయాలి. ఇవన్నీ చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. దానికి బదులు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏమీ చేయకుండా ఎన్నికల హామీల్లా అది చేస్తాం.. ఇది చేస్తాం అని చేప్పి ఏమీ చేయకుండా వదిలేస్తే ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే పనుండదు.. సరికదా ఖాళీగా ఉన్నఉద్యోగాలను భర్తీచేసే పని అసలే ఉండదు. ప్రభుత్వానికి మేలు జరగని అంశం కాబట్టి గత ప్రభుత్వంలోనూ, నేడు కూటమి ప్రభుత్వంలోనూ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వకుండా, కనీసం సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయకుండా అలాగే ఉంచేసింది..
వాస్తవానికి 2024 ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన కూటమి పరిపాలనలో ఏడాది పూర్తవుతున్నా వీరికోసం కనీసం పట్టించుకోకపోవడం వలనే.. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయి సంబరాలు జరుపుతున్నవేళ ఉద్యోగులు నిరసన చేయడానికి పూనుకున్నారు. మొన్నటి వరకూ సచివాలయ మహిళా పోలీసుల అర్హతలను బట్టి వారిని సముచిత స్థానాల్లో కూర్చోబెడతామని చెప్పిన హోంశాఖ మంత్రి ప్రకటన తరువాత క్లస్టర్ విధానంతో అదే మహిళా పోలీసుల పోస్టులు రద్దు చేసి గాల్లో పెట్టినా నేటికీ హోం మంత్రి ఈ విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు. రద్దు చేసిన పోస్టుల్లోని మహిళా పోలీసులను ముందుగా ఖాళీలు ఉన్న చోట భర్తీ చేయకుండానే సాధారణ బదిలీలకు తెరలేపారు. అంటే సాధారణ బదిలీలు జరిగితే.. క్లస్టర్ విధానంలో పోస్టులు రద్దై గాల్లో ఉన్న మహిళా పోలీసులందరినీ ఎక్కడ నియమిస్తారో తెలియని పరిస్థితి. అన్ని ప్రభుత్వశాఖల్లో అటెండర్ల దగ్గర నుంచి గ్రూప్-1 అధికారుల వరకూ పదోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం తమను మాత్రం గాలికొదిలేసి.. పదోన్నతులు, పీఆర్సీ ప్రయోజనాలు, సర్వీసు నిబంధనలు కూడా అమలు చేయకుండా వదిలేసిందని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తమ సమస్య ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలుగా నేటి నుంచి ఆందోళనకు సిద్దమవుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఉపయోగపడేవిధానాలపై రాత్రికి రాత్రే జీఓలు ఇస్తున్నారని కానీ తమ ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో మాత్రం ఎన్ని వినతులు సమర్పించినా కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఉద్యోగులు. ఈసారి ప్రభుత్వం స్పందించి పదోన్నతులు కల్పించి ఇతర 74 ప్రభుత్వ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సర్వీసు నిబంధనలు అమలు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ గత ప్రభుత్వంలోనూ చూశాం.. మన ప్రభుత్వంలోనూ చూసి ఏవీ అమలు చేయకుండానే ఉద్యోగులతో ఇంకా అదనపు పనులు చేయిస్తున్నాం అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులను మరింత ఆవేదనకు గురిచేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందా..? లేదంటే ప్రభుత్వానికి ఇష్టంలేని పనులు, నిరసనలు చేస్తున్నందుకు వీరిని టార్గెట్ చేసి జిల్లాల్లో కలెక్టర్లును, మున్సిపాలిటీల్లో కమిషనర్లను, మండలాల్లో ఎంపీడీఓలను, మున్సిపాలిటీల్లో జోనల్ కమిషనర్లు ఉసిగొల్పుతుందా అనేది వేచి చూడాలి..?!