75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో నేటికీ వర్కింగ్ జర్నలిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుషులులా కనిపించడం లేదు. వేల సంఖ్యలో ఉన్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈరోజుకి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదంటేనే జర్నలిస్టులంటే ప్రభుత్వాలకి ఏ విధంగా కనిపిస్తున్నారో అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఆ ఒక్క ప్రెస్ అక్రిడిటేషన్ పొందాలన్నా 2017 నుంచి నిబంధనలు పూర్తిగా మార్చేశారు. తల్లులకి, ఆటో, కార్ డ్రూవర్లు, రైతులు, న్యాయవాధులు, మఠాధిపతులు, మసీదు గురువులు, చర్చి ఫాదర్ లు, రజకులు, క్షరకులు, ఆఖరికి కూరగాయలు అమ్ముకునే వారికి, రోడ్డుపై తోపుడు బండి వ్యాపారాలు చేసుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలున్నాయి ఒక్క జర్నలిస్టుకి తప్పా. విశేషం, విచిత్రం ఏంటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఈ సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టోలు పత్రికలు, మీడియాలోనూ ప్రచారం చేసేది మళ్లీ జర్నలిస్టులే. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు అడుగు తీసి అడుగు వేసినా, ప్రజలకోసం ఏం చేయాలనుకున్నా.. వారికి తెలియజేయడం కోసం మళ్లీ జర్నలిస్టులే కావాలి..
కానీ మళ్లీ జర్నలిస్టులకు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తింపచేయకూడదు, ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా ఏ స్థానిక పత్రిక, టీవీలు అందుకోలేనన్ని నిబంధనలు ప్రత్యేక జీఓలతో మాత్రం అమలు చేయాలి. అదేంటో ఏ ఒక్క జర్నలిస్టుల సంఘం కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాల దగ్గర ప్రస్తా వించదు. ఎప్పుడూ మీడియాలో ప్రచారాల కోసం చేసే ఉత్తుత్తి ఆందోళనలు తప్పా. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 55 వేల మందికి పైగా జర్నలిస్టులు పెద్ద పత్రికల దగ్గర నుంచి స్థానికపత్రికలు, టీవీఛానల్స్ లో పనిచేసేవారు వారుంటే వారి కుటుంబంలోని సభ్యులు ఓటు హక్కు ఉన్నవారు ఎంత మంది ఉంటారో ఒక్కసారికూడా ఆలోచన చేయడం లేదు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు. ప్రభుత్వం మాత్రం మీడియా సంస్థల ద్వారా లేఖలు ఇస్తే...ముక్కుతూ మూలుగుతూ ఒక్క ప్రెస్ అక్రిడేషన్ మాత్రం ఇస్తుంది. దానితో ఉచితంగా బస్సుపాసు మాత్రమే వస్తుంది. అదీ కూడా రద్దీ సమయంలో కండక్లర్లే క్రిందికి దించేస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసినా అధికారులూ ఏమీ అనరు. ఎందుకంటే జర్నలిస్టులంటే బాగా సంపాదించేవారని ఒక ప్రగాఢ నమ్మకం ఒకటి ఏడ్చి చచ్చింది.
చాలా రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే ప్రెస్, మీడియా, జర్నలిస్టులు అవసరం పడతారు. ట్వంటీస్ కి వచ్చిన తరువాత చాలా రాజకీయపార్టీలు సొంతంగానే మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నిచేసుకున్నా.. పార్టీల్లో నాయకులు వచ్చి పనిచేయరు కదా.. మళ్లీ అక్కడ కూడా వర్కింగ్ జర్నలిస్టులు లేకపోతే మీడియా సంస్థలు నడవవు. ఏం జరుగుతుందో, ఏ విషయాన్ని తెలియజెప్పాలనుకున్నామో మళ్లీ జర్నలిస్టుల ద్వారానే చేయాలి. అలా చేసిన సందర్భంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా.. మళ్లీ అదే నిరంకుసత్వం.. అంటరాని తనం.. బయట మీడియాని తొక్కేయాలి. సొంత మీడియాని అభివృద్ధి చేసుకోవాలి, ఆస్తులు సంపాదించాలనే తత్వం. ఈ నేపథ్యంలో సమిధలువుతున్నది ఒక్క జర్నలిస్టు మాత్రమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టులకోసం ముసలి కన్నీరు కార్చే రాజకీయపార్టీలన్నీ, అధికారంలోకి వచ్చిన తరువాత నియంతలా వ్యవహరించడం రివాజుగా మారిపోతూ వస్తున్నది. ఇన్నేళ్ల కాలంలో జర్నలిస్టుల కోసం ఒక్క సంక్షేమ పథకం ఏ రాజకీయపార్టీ అయినా తన మేనిఫెస్టోలో పొందుపరిచిందా అనే విషయాన్ని 1920 నుంచి చూసుకున్నా 2024 వరకూ కనిపించదు.
అదేంటి హెల్త్ కార్డులు ఇస్తున్నారు కదా అంటే.. సాధారణ ప్రజలకు ఇచ్చే కార్డులకంటే రెండు మూడు రోగాలు పెంచి స్కీములో సగం డబ్బులు కట్టించుకొని కార్డులిస్తున్నారు. అవి ఎప్పుడు పనిచేస్తాయో.. వాటిని ప్రైవేటు ఆసుపత్రుల వాళ్లు ఎప్పుడు ఆపేస్తారో తెలీదు. కేంద్రం ఇచ్చే ఒకేఒక్క సదుపాయం 50శాతం రిబేటుతో ఇచ్చే రైల్వే పాసు. అది రిబేటు స్కీములు వర్తింపచేయలేమని చెప్పి కోవిడ్ కి ముందే తొలగించేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ తొలగించేసింది. జర్నలిస్టుల సంక్షేమ నిధిని రద్దు చేసేసింది. బీపీఎల్ ఫ్యామిలీలకు ఇచ్చే ఇంటి స్థలం కూడా 2015 నుంచి ఇవ్వడమే మానేసింది. 60ఏళ్లపాటు సేవలు అందించిన జర్నలిస్టులకు కనీసం పించను అందించాలనే ఆలోచన కూడా ప్రభుత్వాలకి రాలేదు. కానీ ఓట్లేసిన ప్రజలకు, 50ఏళ్లు దాటిని వారికి మాత్రం ప్రతీనెల రూ.4వేలు పెన్షన్ ఇస్తోంది. వాళ్లకి ఇవ్వడం తప్పుకాదు. ప్రభుత్వల కోసం పనిచేసే జర్నలిస్టులకి ఎందుకు ఇవ్వడం లేదనేదే ఇక్కడ ప్రశ్న. కనీసం ఆ తరహా పించనుకి కూడా జర్నలిస్టులు నోచుకోలేపోతే సమాజంలో నాల్గవ స్థంబంగా జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఇచ్చే విలువ ఏంటో నేటికీ జర్నలిస్టులే గుర్తించడం లేదు.
మాకేటి సిగ్గు అన్నట్టుగానే వ్యవహరిస్తూ.. మళ్లీ ఆహా ఓహో అంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి అదే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల కోసం కీర్తిస్తూ, పొగుడుతూ వార్తలు రాస్తున్నాం. ఇదే వాళ్లకి జర్నలిస్టుల విషయంలో చులకనైంది. మనం పథకాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా, మీడియాని తొక్కేయాలని చూసినా, సోషల్ మీడియాను పెంచుకోవాలని చూసినా జర్నలిస్టుల నుంచి అందునా జర్నలిస్టుల సంఘాల నుంచి వ్యతిరేకత రాలేదూ అంటే జర్నలిస్టులకు ఏమీ చేయాల్సిన పనిలేదు, ఒక్క స్కీము కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదనే నమ్మకానికి వచ్చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంత జరుగుతున్నా.. ఇలాంటి వార్తలు చదువున్న సమయంలో కూడా జర్నలిస్టులన్నవాళ్లు వీటిని చదివి.. ఓహో మన సమస్యల కోసం ఈరోజు భలే వార్త వచ్చిందనుకుని మురిసి పోయి.. మళ్లీ అదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం వార్తలు రాయడానికి ఉదయాన్నే లేచి మళ్లీ వెళ్లిపోతాం.
అదే కదా జర్నలిస్టు అంటే.. ఇక జర్నలిస్టుల కోసం ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తాయి.. కాదాంటారా..? ఎపుడైనా ప్రజాప్రతినిధులనైనా జర్నలిస్టులు మనుషుల్లా కనిపించలేదా..? కనీసం ఒక్క సంక్షేమ పథకం అయినా జర్నలిస్టుల కోసం ప్రవేశాపెట్టారా అని అడిగే దైర్యం ఉందా అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అంటారు..! అందుకే జర్నలిజం వర్ధిల్లాలి.. జర్నలిస్టులు జర్నలిస్టులుగానే ఉండిపోవాలి.. మన సమస్యలపై ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవాలి.. కొన్ని రాజకీయపార్టీల వలన మీడియా పాతాళానికి తొక్కేయబడాలి.. జర్నలిస్టుకి భవిష్యత్తులో ఒకూ ఒక్క పథకం కాదు కదా మరేమీ అందకూడదు, దానికోసం ఏ జర్నలిస్టు సంఘంమూ అడకూడదు.. అదీ విషయం..?!