కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి


Ens Balu
1
Vijayawada
2020-07-07 23:11:25

కేబుల్ ఆపరేటర్లపై పడే పన్నుల భారాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ గౌరవాధ్యక్షుడు, వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోరారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలో రాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ ముఖ్య కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేబుల్ ఆపరేటర్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేబుల్ వ్యవస్థలో వినూత్నమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. భద్రత లేని రంగమే కేబుల్ రంగం అని, 50వేల మంది ఆపరేటర్లు ఏపీలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీ ఫైబర్‌తో కేబుల్ ఆపరేటర్లకు నష్టం లేకుండా చూడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 2020 వచ్చినా ఆపరేటర్ల స్థితిగతులు మాత్రం మారలేదన్నారు. కరోనా సమయంలో కేబుల్ ఆపరేటర్లు ప్రాణాలకు తెగించి ఇంటింటికీ సర్వీసు అందిస్తున్నారని అన్నారు. మంత్రుల కమిటీని కలిసి సమస్యలన్నీ వివరించి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని గౌతమ్ రెడ్డి తెలిపారు