భక్తి పారవశ్యం అఖండపారాయణం..
Ens Balu
4
Tirumala
2020-10-04 16:03:23
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం సుందరకాండలోని 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు ఉన్న 174 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితుల అఖండ పారాయణం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిభావాన్ని పంచింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ ఐదో విడత సుందరకాండ అఖండ పారాయణం ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగింది. ముందుగా టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ శ్రీరామ సంకీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. చివరగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ రచించిన ఆంజనేయ స్తుతిని ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు డా.వందన బృందం రమ్యంగా ఆలపించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులు శ్లోకపారాయణం చేశారు. ఈ సందర్భంగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ రామనామం ఎక్కడ పలికితే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని, హనుమంతుని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు నెరవేరుతాయని చెప్పారు. ధర్మ ప్రచారంలో భాగంగా మానవులకు సిరిసంపదలు కలిగేందుకు విరాట పర్వం, ధార్మిక చైతన్యం అలవడేందుకు గీతా పారాయణం చేపడుతున్నట్టు వివరించారు.
ఇప్పటివరకు నాలుగు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8 నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాల అఖండ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ ఏ.వి.ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటి ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.