శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి రథోత్సవం..
Ens Balu
3
Tiruchanur
2020-11-18 14:53:31
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం ముత్యపు (ముత్తంగి) అలంకారంలో అమ్మవారు రథంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న చెక్క రథంపై అమ్మవారిని వేంచేపు చేశారు. ఈ రథోత్సవం ఏకాంతంగా జరిగింది. శరీరం - రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి - సారథి, మనస్సు - పగ్గాలు, ఇంద్రియాలు - గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్ దంపతులు, సిఇ రమేష్‌రెడ్డి, విఎస్వో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ కుమార్, ఏవిఎస్వో చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.