26న సూర్యభగవానుడి తెప్పోత్సవం..
Ens Balu
1
Arasavilli
2020-11-20 21:02:03
శ్రీసూర్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవాన్ని క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఈ నెల 26న అరసవల్లి నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ వెల్లడించారు. తెప్పోత్సవం, స్వామి వారి స్వర్ణాభరణాల అలంకరణపై శుక్రవారం దేవాలయ సమావేశ మందిరంలో పాలకమండలి సభ్యుల పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రధాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే కార్తీక మాసంలో ఏకాదశి పవిత్రమైనదని, ఆరోజున స్వామి వారి స్వర్ణాభరణాలను స్వామి వారికి అలంకరించడం జరుగుతుందని అన్నారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో స్వర్ణాభరణాలతో స్వామి వారిని భక్తులు వీక్షేంచేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో భద్రతా దృష్ట్యా స్వర్ణాభరణాలను అలంకరణ చేయలేదని, వాటితో పాటు ఇటీవల స్వామి వారి కోసం తయారుచేసిన ఆభరణాలను కూడా ఇకపై అలంకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్షీరాబ్ధి ద్వాదశి అనగా ఈ నెల 26న స్వామి వారి తెప్పోత్సవం ఉంటుందని చెప్పారు. కరోనా దృష్ట్యా భక్తులెవరినీ స్వామి వారి తెప్పోత్సవానికి అనుమతించడం లేదని, అలాగే దీపాలు వెలిగించే భక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా నాగావళి నదీ తీరంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోనేరులో ఊరేగే స్వామివారికి పూల అలంకరణతో పాటు విద్యుత్ అలంకరణ ఉంటుందని అన్నారు. తెప్పోత్సవం అనంతరం స్వామి వారి ఊరేగింపు ఉంటుందని, తదుపరి మూలవిరాట్ కు అనివెట్టి మండపంలో పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాల వితరణ ఉంటుందని అన్నారు. తెప్పోత్సవంలో అర్చకులు, ఆలయ సిబ్బంది, దివిటివారు, డ్రెస్ కోడ్ ఉన్న సిబ్బంది, మీడియా మినహా వేరేవారు పాల్గొనేందుకు అనుమతి లేదని ఇ.ఓ స్పష్టం చేసారు. గతంలో స్వామి వారి స్వర్ణాభరణాలతో పాటు ఇటీవల స్వామివారికి చేయించిన ఆభరణాలను ఈ నెల 23న మధ్యాహ్నం 12.00గం.లకు మీడియా ముందు ప్రదర్శించడం జరుగుతుందని, వాటిని భక్తులకు తెలిసేలా ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, మండల మన్మధరావు, అంధవరపు రఘురామ్, పైడి భవాని, కింజరాపు ఉమారాణి, యామజాల గాయత్రి తదితరులు పాల్గొన్నారు.