భారత రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
3
Chittoor
2020-11-23 15:34:25

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నవంబర్ 24న మంగ‌ళ‌వారం తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్త‌వుతున్నాయని టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో ఛైర్మ‌న్, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి సోమ‌వారం ఏర్పాట్లను ప‌రిశీలించారు. ఇందులో భాగంగా తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, రాంభగీచ వ‌స‌తి భ‌వ‌నాలు, శ్రీ వరాహ స్వామి ఆల‌యం, శ్రీవారి ఆలయాలలో ఏర్పాట్లను పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి  శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నందున  కోవిడ్ - 19 పరిస్థితుల దృష్ఠ్యా ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రపతి ప‌ర్య‌టించే ప్రాంతాల‌లో ప్రతిచోటా ప‌‌రిమిత సంఖ్య‌లో సిబ్బందిని నియ‌మించిన‌ట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి ముంద‌స్తుగా కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌మ‌న్నారు. సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్  భారత్ నారాయణ్ గుప్తా, ఎస్పీ  రమేష్ రెడ్డిలు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలియ‌జేశారు.  సిఇ  రమేష్ రెడ్డి, ఇఇ  జగన్మోహన్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరింద్రనాథ్, విజిఓ  బాలి రెడ్డి, ఎవిఎస్వో  గంగరాజు, టెంపుల్ పేష్కర్ జగన్మోహనాచారి తదితరులు పాల్గొన్నారు.