ఆ జిల్లా కలెక్టర్ పేరు చెబితే హడల్..


Ens Balu
3
Kurnool
2020-11-24 10:55:23

ప్రభుత్వం తమను ప్రతిష్టాత్మక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోకి ఉద్యోగులుగా తీసుకుంది.. ఆడుతూ పాడుతూ పనిచేసినా ఎవరూ పట్టించుకోరు..ఒక వేళ వచ్చినా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతున్నారు.. పెద్దగా అధికారుల పర్యటనలు..డ్యూటీ చార్ట్ పట్టించుకోవాల్సిన పనిలేదు..దిల్ ఖుష్ రాజా అంటూ విధులు నిర్వహించేయొచ్చు.. అనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏకంగా 9 మంది గ్రామసచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇపుడు రాష్ట్రంలోనే సంచనలంగా మారింది. గ్రామసచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి, అక్కడి ఉద్యోగుల్లో జవాబుదారీ తనాన్ని పెంపొందించడానికి జిల్లా కలెక్టర్లు, జెసి, ఇతర ప్రత్యేక అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యటనలు చేస్తున్నా... ఇప్పటి వరకూ ఎక్కడా ఎవరినీ సస్పెండ్ చేయలేదు. అదే కొందరు గ్రామసచివాలయ ఉద్యోగులకు, సిబ్బందికి అలుసుగా మారింది. అదే సమయంలో కర్నూలు జిల్లాలో కూడా ఇదే విధంగా సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం వహించి కలెక్టర్ వీరపాండియన్ సచివాలయం సందర్శించే సమయానికి ఉద్యోగులు లేకపోవడంతో వెంటనే 9 మంది సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కర్నూలు జిల్లాయే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే హడలి చస్తూ(ఒకటీ, రెండూ పోసుకుంటున్నారు) పైగా కర్నూలు జిల్లా వీరపాండియన్ సస్పెండ్ చేసిన ఉత్తర్వులను సోషల్ మీడియాలో పెడుతూ, అన్ని జిల్లాల సచివాలయ సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నారు. కొత్తగా చేరిన ఉద్యోగులతో ఇంతకాలం ప్రజలకోసం పనిచేయాలని చెప్పి పనిచేయిస్తున్న అధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తీసుకున్న చర్యలతో బలమొచ్చింది. ఇకపై తాము కూడా ఈ విధంగానే వ్యవహించాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అటు ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లు, ప్రత్యేకంగా సచివాలయాల కోసం నియమించిన జెసిలకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడంతో ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు రాష్ట్రంలోని కలెక్టర్లు, జెసిలు. ఇక పనిచేయకుండా పబ్బం గడిపేద్దామనుకునే సచివాలయ ఉద్యోగులందరూ జాగ్రత్తగా ఇంటికెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది.