లోకకల్యాణం కోసం తులసి వివాహం..
Ens Balu
2
తిరుమల
2020-11-26 16:20:52
విశ్వంలోని సకలజీవులు సుభిక్షంగా ఉండాలని, లోకకల్యాణం కోసం తులసి వివాహం కార్యక్రమాన్ని టిటిడి చేపట్టిందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఉద్ఘాటించారు. కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా గురువారం తిరుమల వసంత మండపంలో శ్రీ తులసి ధాత్రి సహిత దామోదర పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ పూజలో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన ధర్మంలో తులసి వివాహానికి విశేష ప్రాధాన్యం ఉందన్నారు. జీవితచక్రంలో వివాహం ముఖ్యమైన ఘట్టమన్నారు. తులసి భక్తికి, ఆరోగ్యానికి ప్రతీక అన్నారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుందని, మహిళలు తమ సౌభాగ్యం కోసం తులసికి పూజలు చేస్తారని చెప్పారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా పవిత్రమైన కార్తీక మాసంలో టిటిడి చేపట్టిన కార్తీక దీక్ష కార్యక్రమాలను అభినందించారు. అంతకుముందు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ తులసీ ధాత్రి సహిత దామోదర పూజ విశిష్టతను తెలియజేశారు. అనంతరం కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనా సూక్తం, తులసి, ధాత్రి(ఉసిరి) కల్యాణం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి తిరువారాధన చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది. అదేవిధంగా, రాత్రి ... 7.15 నుంచి 7.45 గంటల వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై డా.మారుతి 'కార్తీక పురాణం - విష్ణువైభవం' పారాయణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్ఎకె.సుందరవదనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.