ఆ ఐటిడిఏ పీఓ కొడుకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతాడు..
Ens Balu
3
Parvathipuram
2020-11-28 14:01:37
ఆయనొక ఐటిడిఏకి ప్రాజెక్టు అధికారి..వ్రుత్తిరీత్యా జాయింట్ కలెక్టర్ కేడర్ ఉద్యోగి.. చుట్టూ మందీ మార్భలం..చిటికేస్తే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లాడిని చదివించడానికి క్యూ కడతాయి..నచ్చిన కార్పోరేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మాద్యమంలో ఠీవిగా చదివించుకోవచ్చు..తన హుందాతనానికి అనుగుణంగా కాసుల పందిరి కింద పాఠాలు చెప్పించుకోవచ్చు.. కాని ఆ అధికారికి మాత్రం ప్రభుత్వ పాఠశాలలంటే అమిత మైన గౌరవం..ప్రైవేటు పాఠశాలలొద్దు..ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని భావిస్తారు..ఆయన ఏ జిల్లాకి అధికారిగా బదిలీపై వెళ్లినా తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారు..ఆయనే విజయనగరం జిల్లా, పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాధ్.. ప్రభుత్వ కార్యాలయాల్లోని అటెండర్లు, వాచ్ మెన్లు సైతం తమ పిల్లలను కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదివిస్తున్న ఈ రోజుల్లో తమ పిల్లాడిని మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ప్రభుత్వ ఉన్నతాధికారి. వేల మంది విద్యార్ధులను తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కంటే డబ్బుని బట్టీ విద్యార్ధుల బాగోగులు చూసే ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లకు ఏం చదువొస్తుంది అంటారాయన.. ప్రపంచంలోనే ఒక్క ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ప్రతిభకు పట్టం కడతారని, ఆ విధానం ప్రైవేటు పాఠశాలల్లో ఉండదని చెబుతారు. పిల్లల్లో చదువుపై పోటీ తత్వం పెరిగేలా ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రమే చేయగలరని బలంగా నమ్మే ఈ అధికారి తాను ఏ ప్రాంతానికి బదిలీ అయినా అక్కడి ప్రభుత్వ పాఠశాలలో తన కుమారుడిని చదివిస్తున్నారు. పార్వతీపురంలోని కొత్తపోలమ్మ పురపాలక పాఠశాలలో తన కుమారుడిని చదివిస్తున్నారు. ఈయన పాఠశాలకు వెళ్లిన సందర్భంలో ఉపాధ్యాయులకు చెప్పే మాట ఒక్కటే. మా వాడ్ని ఒక అధికారి కొడుకుగా కాకుండా చదువులో ఏ విధంగా రాణిస్తున్నాడనే కోణంలోనే చూడండి అంటూ ఉపాధ్యాయులకు సైతం తన వ్యక్తిత్వాన్ని అర్ధమయ్యేలా చెబుతుంటారు. దీనితో తండ్రి ఆశయాలకు అనుగుణంగా కుమారుడు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే తన విద్యాబ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులంతా ఒక్కసారి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే.. కాసుల పందిరి కింద విద్య నేర్పే ప్రైవేటు విద్యాసంస్థలకు చరమ గీతం పాడటం పెద్ద పనేం కాదు. అయినా ఇపుడు ప్రభుత్వమే ఆంగ్లమాద్యంలో పాఠ్యాంశాలు బోధిస్తున్న తరుణంలో ఇక ప్రైవేటు పాఠశాలతో పనేముందనే విషయాన్ని పార్వతీపురం ఐటిడిఏ అధికారి కూర్మనాధ్ లా అందరూ ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలల వైభవం దేశానికే ఆంధ్రప్రదేశ్ ని మార్గదర్శిని చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులోనూ ఉన్నతంగా ఆలోచించే అధికారుల ఆలోచనలు కూడా ఇంతే మంచిగా ఉంటాయనడానికి పార్వతీపురం ఐటిడిఏ పీఓ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు.