శ్రీభగవద్గీత పారాయ‌ణంతో జ్ఞానం..


Ens Balu
2
Tirumala
2020-11-28 20:47:43

శ్రీ కృష్ణ ప‌ర‌మాత్ముడు ఉప‌దేశించిన భగవద్గీతకు సమానమయిన గ్రంధం ఈ లోకంలో మరొకటి లేదని, గీతా పారాయ‌ణంతో జ్ఞానం, స‌త్‌ప్ర‌వ‌ర్త‌న, ప్ర‌సాదిస్తాయ‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి తెలిపారు. కంచి స్వామి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై శనివారం సాయంత్రం గీతా పారాయ‌ణంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వామివారు అనుగ్రహభాషణం చేస్తూ సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన  శ్రీభగవద్గీత ప్రపంచంలోని  సర్వ మానవాళికి అన్ని సమస్యలకు మార్గం చూపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని అనుసరిస్తే ధర్మమే అందరిని కాపాడుతుందన్నారు. జప, హోమ, దానాల ద్వారా జ్ఞాన జ్యోతిని పొంద‌వ‌చ్చ‌న్నారు. కంచి పీఠం ఆధ్వర్యంలో 1966వ సంవత్సరం నుండి భగవత్ గీతను ముద్రించి దేశ విదేశాల‌లో ప్రచారం చేస్తున్న‌ట్లు తెలిపారు. టిటిడి ప్రతి రోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో గీతా పారాయణం నిర్వహించడాన్ని అభినందించారు. ఈ  కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వీక్షిస్తున్నార‌ని, త‌ద్వారా గీతా సారాంశాన్ని తెలుసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. లోక కల్యాణార్థం సెప్టెంబర్ 10వ తేదీ నుండి ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు టిటిడి తిరుమలలో గీతా పారాయణం నిర్వహిస్తున్న విషయం విదితమే. టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి , బోర్డు సభ్యులు  డి.పి.అనంత,  గోవింద‌హరి,  కృష్ణమూర్తి వైద్య‌నాధ‌న్‌ తదితరులు  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.