వసంత మండపంలో శ్రీ విష్ణుసాలగ్రామ పూజ..
Ens Balu
3
Tirumala
2020-12-05 19:37:06
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శనివారం తిరుమల వసంత మండపంలో శ్రీ విష్ణుసాలగ్రామ పూజ ఘనంగా జరిగింది. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ విశేషమైన భగవత్ శాస్త్రంలో చెప్పడినట్లు సాలగ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ ముక్కోటి దేవతలు ఉంటారని తెలిపారు. సృష్ఠి, స్థితి, లయ కారకుడైన శ్రీ మహవిష్ణువు కూడా అక్కడే కొలువై ఉంటారన్నారు. కృత, త్రేత, ద్వాపర యుగాలలో వేలాది సంవత్సరాలుగా తపస్సు, యజ్ఞ యాగాలు చేయడం వల్ల పొందే ఫలితాన్ని, కలియుగంలో పవిత్ర కార్తీక మాసంలో విష్ణుసాలగ్రామ పూజ చేసిన, దర్శించిన, ఆ మంత్రాలను విన్న అంతటి ఫలితం సిద్ధిస్తుందని వివరించారు. ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత సాలగ్రామాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాలగ్రామాలకు ప్రత్యేక వేద మంత్రాలచే ఆరాధన, నివేదన, హారతి సమర్పించారు. చివరిగా క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది. ఈ పూజ కార్యక్రమంలో అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్ఎకె.సుందరవరదచార్యులు, శ్రీవారి ఆలయ ఓఎస్‌డి పాల శేషాద్రి, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.