పులకించిన తిరుమల గిరులు..
Ens Balu
2
Tirumala
2020-12-06 16:24:04
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో ఆదివారం ఉదయం జరిగిన సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితుల అఖండ పారాయణంతో వసంత మండపం పులకించింది. సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ ప్రపంచ ప్రజల యోగ క్షేమం కొరకు టిటిడి 241 రోజులుగా శ్రీవారి అనుగ్రహంతో మంత్ర పారాయణ కార్యక్రమం నిర్వహస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో సుందరకాండలోని 68 సర్గలలోని 2821 శ్లోకాలను మొత్తం 16 పర్యాయలు అఖండ పారాయణం చేయనున్నట్లు తెలిపారు. సుందరకాండ పారాయణం చేయడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వివరించారు.
ఇప్పటివరకు ఆరు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8 నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాలు, అక్టోబరు 4న ఐదవ విడత 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు 174 శ్లోకాలను, నవంబరు 3న ఆరో విడత 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు185 శ్లోకాలు అఖండ పారాయణం జరిగింది.
కాగా టిటిడి ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం " దాశరధీ కరుణాపయోనిధి ...... " , అనే సంకీర్తనను కార్యక్రమం ప్రారంభంలో, టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ " శ్రీ హనుమ.....సీతారామ ప్రియ శ్రీ హనుమ....జై హనుమ ......" అనే సంకీర్తనను కార్యక్రమం ముగింపులో సుమధురంగా అలపించారు.
అఖండ పారాయణంలోని 24వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను శ్రీ పవన్‌కుమార్ శర్మ, శ్రీ రామానుజాచార్యులు పారాయణం చేశారు. ఈ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, జాతీయ సంస్కృత వర్సిటి ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి, ఎస్వీ వేద ఉన్నత వేద అధ్యాయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ పాల్గొన్నారు.