గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి..
Ens Balu
4
Tirumala
2020-12-07 14:34:42
గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. హిందూ ధర్మ రక్షణ కోసం టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమానికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని కోరారు.టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణ శాల నేతృత్వంలో అమలు చేయనున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని సోమవారం విజయవాడ కనక దుర్గ ఆలయంలో మంత్రి వెలం పల్లి శ్రీనివాస్ తో కలసి ఆయన ప్రారంభించారు. వేద పండితుల మంత్రో చ్చారణల నడుమ దుర్గ గుడికి గోవు, దూడను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ , హిందూ ధర్మం లో గోమాతకు తల్లి స్థానం ఇచ్చారునీ అందుకే గోవును గోమాత అంటామన్నారు.
గోవును పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. గో సంరక్షణ కూడా హిందూ ధర్మ పరిరక్షలో ఒక భాగమే నని చైర్మన్ చెప్పారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదంతో గోసంరక్షణ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు యారవుతున్నాయని ఆయన చెప్పారు. హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నామన్నారు.ఈ కార్యక్రమం అమలు కోసం ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా దేశవాళీ ఆవుల దానాన్ని స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
మఠాలు, పీఠాలు, వంశపారంపర్య పర్యవేక్షణ ఆలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వేద పాఠశాలలకు ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ గోవుతో పాటు దూడను అందజేస్తుందన్నారు. గోదానం పొందిన ఆలయాలు, పీఠాలు, వేదపాఠశాలలు గోవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. టిటిడి ద్వారా దానం పొందిన గోవుల వద్ద గుడికో గోమాత - టిటిడి అనే బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వివరించారు. ఎస్వీ గోసంరక్షణశాల ముందస్తు అనుమతితోనే భక్తులు ఈ కార్యక్రమానికి గోవులను దానం చేయాల్సి ఉంటుందని శ్రీ వైవి చెప్పారు. రాష్ట్ర దేవ దాయ శాఖ మంత్రి శ్రీ వేలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గోసంరక్షణ కోసం టీటీడీ చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నారు.
శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, కొలుసు పార్థ సారథి, టీటీడీ జెఈఓ బసంత్ కుమార్, ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, దుర్గ గుడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు సోమి నాయుడు, ఈఓ సురేష్ బాబు పాల్గొన్నారు.