50 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లక్ష్యం..
Ens Balu
3
Vijayawada
2020-12-08 18:07:13
కరోనా నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల ప్రాధాన్యత పెరిగిందని దీంతో రాష్ట్రంలో ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు కూడా మరింత పెరిగాయని ఏ.పి. ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టరు యం. మధుసూధనరెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని కరోనా నేపథ్యంలో వాటి ప్రాధాన్యత మరింత పెరిగిందని మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 70 శాతం పనులు ఇంటర్నెట్ ఆధారంగానే ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని విద్యాభోధన కూడా ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ఇంటర్నెట్ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఏ.పి. ఫైబర్ నెట్ ద్వారా హైస్పీడ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలకు అందించాలన్న ప్రతిపాదన తీసుకురావడం జరిగిందన్నారు. బేసిక్ ప్యాక్ రూ. 300 లు, ఎ సెన్షియల్ ప్యాక్ రూ. 449 లు, ప్రీమియం ప్యాక్ రూ. 599 లు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ సేవల్లో భాగంగా ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సదుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది చందాదారులకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 660 మండలాలు, 6300 గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా సేవలు అందించడం ఏ.పి. ఫైబర్ నెట్ ప్రత్యేకత అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు, రైతుభరోసా కేంద్రాలకు, వైయస్ఆర్ ఆరోగ్య కేంద్రాలకు, పాలసేకరణ కేంద్రాలకు, నాడు-నేడు పాఠశాల కార్యక్రమాలకు ఏ.పి. ఫైబర్ నెట్ ఇంటర్నెట్ కనెక్టవిటీని అనుసంధానం చేసామన్నారు. వీటికి టెలిఫోన్ సౌకర్యాన్ని అందించడం గమనార్హమని మధుసూధనరెడ్డి తెలిపారు. ట్రంక్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ మౌలిక సదుపాయాలు కలిగి 24 కిలోమీటర్ల నిడివిలో ఆర్కిటెక్చర్ కలిగి ఉన్న సాంకేతిక అనుసంధానంతో ఒక వలయంగా రాష్ట్రవ్యాప్తంగా 2600 ప్రదేశాలలో పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్‌తో కూడిన సేవలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ సేవలను గ్రామపంచాయతీలతో ఫేజ్ - 2 ప్రాజెక్టులో భాగంగా అనుసంధానం చేస్తున్నట్లు మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల గృహాలకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోనికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఆదేశించారని మధుసూధనరెడ్డి తెలిపారు. రాబోయే 2, 3 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలను అనుసంధానం చేస్తామన్నారు. పెరుగుతున్న ఖాతాదారులకు అనుగుణంగా సిపిఇ బాక్స్‌లను కూడా సరఫరాను పెంచుతామని ఆయన తెలిపారు. స్ధానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్ల నిర్వాహకులతో ఏ.పి. ఫైబర్ నెట్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు.