తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మూడవ రోజైన మంగళవారం శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలలో నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధన, పంచగవ్యారాధన నిర్వహించారు. తరువాత సర్వదైవశ్చహోమం, పరమాత్మిక హోమం, శాంతి హోమాలు జరిగాయి. కాగా, మంగళవారంనాడు ఉదయం బాలలయంలో ఉండే స్వామివారి దారు బింబమునకు, ఎదురు ఆంజనేయస్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్యకారులవారికి, విమాన గోపురం నమూనాకు పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం, నవకలశ స్నపనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఎన్ఎకె.సుందరవరదచార్యులు, ఎపి అనంతశయన దీక్షితులు, ఆలయ ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.