బాలాలయ సంప్రోక్షణలో చతుర్థశ కలశ స్నపనం
Ens Balu
2
తిరుమల
2020-12-09 22:16:12
తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణలో భాగంగా నాలుగవ రోజైన బుధవారం చతుర్థశ కలశ స్నపనం నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధన, విశేష హోమాలు నిర్వహించారు. తరువాత యాగశాలలో భగవత్ వైఖానస ఆగమోక్తంగా వివిధ దేవత మూర్తుల సూక్త మంత్రములతో మహాశాంతి కుంబ జప్యం నిర్వహించారు. కాగా, బుధవారంనాడు సాయంత్రం బాలాలయంలో ఉండే స్వామివారి దారు బింబము శుద్ధి కొరకు చతుర్థశ కలశ స్నపనం నిర్వహించారు. ఇందులో 7 ప్రధాన అభిషేక ద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో, 7 విశేష మంత్ర జల కలశాలతో అభిషేకం జరిగింది. అనంతరం ద్వార పాలకులు, ఎదురు ఆంజనేయస్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్యకారులవారికి, విమాన గోపురం నమూనాకు అభిషేకం నిర్వహించారు. దీని వలన బింబములోని దోషాలు తొలగి పోయి, జీవశక్తి బింబములోనికి ప్రవేశిస్తుందని అర్చకులు తెలిపారు.
తరువాత యాగశాలలో శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ వరాహస్వామివారి ఉత్సవర్లకు పంచామృత అభిషేకం నిర్వహించారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహా సంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఎన్ఎకె.సుందరవరదచార్యులు, ఎపి అనంతశయన దీక్షితులు, ఆలయ ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.