ఘనంగా శ్రీ తులసీ విష్ణు సమారాధనం..
Ens Balu
2
Tirumala
2020-12-12 21:31:13
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శనివారం తిరుమల వసంత మండపంలో శ్రీ తులసీ విష్ణు సమారాధనం ఘనంగా జరిగింది. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ తులసీ వృక్షాన్నివసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ తులసీ అంటే శ్రీ మహాలక్ష్మీ రూపమని, తులసీలో సమస్త దేవతలు ఉంటారన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తులసీకి భక్తి పూర్వకంగా దీపారాధనతో ప్రార్థించడం వలన జన్మ జన్మల జన్మ జన్మల పాపం నశిస్తుందని, ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుందని తెలిపారు. ఎక్కడ లక్ష్మీ ఉంటుందో అక్కడ శ్రీ మహవిష్ణువు కొలువై ఉంటారు కావున ఆ ఇంటి వైపు ఎలాంటి దుష్ట శక్తులు రావని తెలియజేశారు. భూలోక కల్పవృక్షమైన తులసీని విష్ణువుతో కలిసి పూజ చేయడం వలన స్త్రీకి పుత్రపౌత్రాబివృద్ధి కలిగి, దీర్ఘ సుమంగళి యోగం, సమస్త వ్యాధులు నయమవుతాయని తెలిపారు.
పవిత్ర కార్తీక మాసంలో తులసీతో కూడిన శ్రీ మహవిష్ణువును పూజించడం వలన సంవత్సరం అంతా పూజ చేసిన ఫలం, సమస్త నదులలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుందని వివరించారు. ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత తులసీ విష్ణు పూజ, నివేదన, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళిధర్ శర్మ, శ్రీవారి ఆలయ పేష్కార్ జగన్మోహనాచార్యులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.