భక్తుని చెంతకు భగవంతుడు..
Ens Balu
1
Tirupati
2020-12-13 20:30:56
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం కార్తీక మాస కడపటి ఆదివారం ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి సన్నిధి వీధిగుండా ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఎదురు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ చేసి నివేదన, ఆస్థానం నిర్వహించారు. తదుపరి స్వామి అమ్మవార్లను ఒక తిరుచ్చి మీద, శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఇంకొక తిరుచ్చి మీద వేంచేపు చేసి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆంజనేయ స్వామి వారు విమాన ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో మూలవర్లకు పూలంగి సేవ, అధిక సంఖ్యలో దీపాలను వెలిగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ రాజేంద్రుడు, ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.