17న బిసిల సంక్రాంతి వేడుక..
Ens Balu
1
Vijayawada
2020-12-14 22:15:13
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బి.సి.ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిని గుర్తించడం జరిగిందని, బి.సి.ల సంక్రాంతి పేరిట 56 బి.సి. కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు, డైరెక్టర్లు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణాశాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌లు పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, తదితరులతో కలిసి మంత్రులు ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 139 వెనుకబడిన కులాలను గుర్తించి ప్రభుత్వం వారికి తగిన ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. డిశంబరు 17 గురువారం ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి సమక్షంలో 56 బి.సి. కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు, కార్పోరేషన్‌లలో నియమించబడిన 672 మంది డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఛైర్మన్‌లు సభావేదికపై నుండి ప్రమాణస్వీకారం చేయడం జరుగుతుందన్నారు. 672 మంది డైరెక్టర్లు సభావేదిక ముందు ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్యాలరీ నుండి ప్రమాణస్వీకారం చేస్తారని మహిళలకు, పురుషులకు సంబంధించి విడివిడిగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసందర్శనలో మంత్రులతోపాటు బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, శాసన సభ్యులు మెరుగు నాగార్జున, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, రాష్ట్ర ప్రజాప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి, జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవిలత, జాయింట్ కలెక్టరు (ఆసరా) కె. మోహన్‌కుమార్ , స్ధానిక నాయకులు దేవినేని అవినాష్, తదితరులు పాల్గొన్నారు.