ప్రపంచానికే డా.బీఆర్ అంభేద్కర్ ఆదర్శం..


Ens Balu
2
Anantapur
2020-12-17 21:35:50

ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా.బి.ఆర్. అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యుల్డ్ కులముల శాసనసభా కమిటీ అధ్యక్షులు  గొల్ల బాబూరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం అనంతపురం నగరంలోని క్రీసెంట్ స్కూల్ సమీపంలో డా.బి.ఆర్. అంబేద్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు డా. బి.ఆర్.అంబేద్కర్ అత్యున్నత మైన రాజ్యాంగాన్ని  రూపొందించడం ద్వారా భారత రాజ్యాంగం నేడు దేశానికి శ్రీరామరక్షగా నిలిచిందన్నారు. ముఖ్యంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు తొలగాయన్నారు. అంతేగాక అందరికీ సమాన అవకాశాలు కల్పించబడుతున్నట్లు ఆయన  పేర్కొన్నారు . డా.బి.ఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అంటరానితనం అనే సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు, దేశ ప్రజలందరికీ సామాజిక న్యాయం అందేలా రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలో పేర్కొన్న హక్కుల ద్వారా భారతదేశ ప్రజలందరూ లబ్ది పొందుతున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలు , ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందన్నారు. ఒకవైపు ప్రజల సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి కట్టుబడి ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు .వారి ఆదేశాల మేరకే జిల్లా పర్యటనకు రావడం జరిగిందన్నారు .జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుంటున్నామని,  అలాగే అణగారిన వర్గాల సమస్యలు,వాటి పరిష్కార మార్గాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు తమ కమిటీకి ఎంతో సంతృప్తిని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతపురం ప్రధాన కేంద్రంలో నేడు ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డిి, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు తన చేతుల మీదుగా డా. బి.ఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ ఆర్చ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం శాశ్వతమైన, ఆదర్శవంతమైన కార్యక్రమమని, ఒక గొప్ప సంకల్పం ఉంటే గానీ ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం కావని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలను ఇతర జిల్లాలకు తెలియజేస్తామన్నారు. భవిష్యత్తులో కూడా జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, ప్రజలకు సామాజిక న్యాయం,  ఆర్థిక అభివృద్ధి ,ఆత్మగౌరవం ప్రజాస్వామ్యాన్ని అందించడమే రాజ్యాంగం లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. నేడు డా. బి.ఆర్ .అంబేద్కర్ ఆర్చ్ నిర్మాణం చేపట్టడం ఎంతో శుభదినంగా భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. అంతేగాక సంస్కృతి, సాంప్రదాయాలు, రాయలసీమ మరియు అనంతపురం జిల్లా విశిష్టతను తెలిపే విధంగా అనంతనగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. గతనెల 26న అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి , ఎంపీ తలారి రంగయ్య ల ప్రతిపాదనల మేరకే రాంనగర్ బ్రిడ్జికి  డా .బి.ఆర్.అంబేద్కర్ పేరును నామకరణం చేయడం జరిగిందన్నారు. అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ,అణగారిన వర్గాలకు గుర్తింపు, గౌరవం కోసం రాజ్యాంగాన్ని అందజేసిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. గత నెల 26న రాంనగర్ ఓవర్ బ్రిడ్జిని డా. బి ఆర్. అంబేద్కర్ పేరు తో నామకరణం చేసి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నామని గుర్తు చేశారు . అంబేద్కర్  రచించిన భారత రాజ్యాంగం చలువ వల్లనే ఈ ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలు స్వేచ్ఛ అనుభవిస్తున్నట్లు  ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నేడు సుమారు రూ .50 లక్షల వ్యయంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ ఆర్చ్ నిర్మాణం చేపట్టడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని , అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. అనంతపురం ప్రధాన కేంద్రంలో మన అనంత- సుందర అనంత కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో రోడ్ల నిర్మాణం ,సుందరీకరణ తదితర పనులు జరుగుతున్నాయని, కరోనా కారణంగా అసంపూర్తిగా ఉన్న  పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేస్తామన్నారు.  అంతకుముందు  జిల్లా అగ్నిమాపక శాఖ  అధికారి కార్యాలయం ,కోర్టు రోడ్డు వైపు ఉన్న సెల్ఫీ పాయింట్ గోడలపై "మన రాజ్యాంగ ఘట్టాలు " పేరుతో చిత్రించిన దృశ్యాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల శాసన కమిటీ అధ్యక్షులు గొల్ల బాబూరావు, సభ్యులు ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు , ఉన్నమట్ల ఎలిజా, ఎమ్మెల్సీ శమంతకమణి , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  , పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్యలు ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్ ,డా.ఏ. సిరి,గంగాధర్ గౌడ్ ,అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య,  మున్సిపల్ కమిషనర్ పి. వి .ఎన్. ఎన్. మూర్తి , టూరిజం రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య , ఆర్డిఓ గుణ భూషణ్ రెడ్డి ,జిల్లా టూరిజం అధికారి దీపక్, పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.