కొత్త సంవత్సరంలో కళ్యాణమస్తు..


Ens Balu
2
Tirumala
2020-12-24 16:33:23

ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో  కొత్త సంవత్సరం లో కళ్యాణమస్తు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. భక్తులకు సేవ చేస్తున్న శ్రీవారి సేవకులు టీటీడీ నిర్వహించే అన్ని ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల ఆస్థాన మండపం లో గురువారం నిర్వహించిన శ్రీవారి సేవకుల సమావేశంలో చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా  సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తి స్పూర్తి గా 2000 నవంబరు లో కంచి పీఠాధిపతి స్వర్గీయ శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి  శ్రీవారి సేవ ప్రారంభించారన్నారు. 200 మందితో ప్రారంభమైన శ్రీ వారి సేవలో 20 ఏళ్లలో సేవ అందించిన 12 లక్షల మంది సేవకులకు ఆయన అభినందనలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో కూడా సేవ కోసం వచ్చిన సేవకులు తిరుమల సహా అన్ని స్థానిక ఆలయాల్లో కూడా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ భక్తులు కూడా వీటిని పాటించేలా చేయాలని కోరారు.  సి ఎం  జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో టీటీడీ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీల్లో 500 ఆలయాలు నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా గోవులను పోషించుకోగలిగే  ఆలయాలకు గోవులను ఇవ్వనున్నట్లు చెప్పారు. పేద ప్రజలు పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పుల పాలు కాకుండా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెళ్ళిళ్ళు చేయించడానికి కొత్త సంవత్సరం లో కళ్యాణ మస్తు కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటకు బట్టలు, మంగళ సూత్రం ఇవ్వడంతో పాటు ఇరు వైపుల వారికి భోజనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.       బ్రహ్మోత్సవాల తరహాలో ఈ సారి నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కూడా 10 రోజులు నిర్వహిస్తున్నామని చైర్మన్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సేవ చేయడం మహాభాగ్యమని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీ సత్యసాయి సేవా సమితి వారు శ్రీ వారి సేవకులకు శిక్షణ ఇస్తుండటం ప్రశంస నీయమన్నారు.         టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, భక్తుల కోరిక, పీఠాధి, మఠాధిపతుల సలహా మేరకు 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అమలు చేస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీ వారి సేవకులు కోవిడ్ 19 నిబంధనలు జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. మాస్కు లు ధరించని వారికి వివరించి చెప్పాలని, క్యూ లైన్లు,ఆలయం తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, చేతులు శుభ్రం చేసుకునేలా చేయాలని కోరారు.        ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి  విభీషణ శర్మ, ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ రవి తో పాటు ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.