వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
3
Tirumala
2020-12-24 20:35:14

తిరుమలలో 10 రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు శుక్రవారం ఉదయం 7- 30 గంటల నుంచే దర్శనం ప్రారంభిస్తామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనం లో గురువారం సాయంత్రం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీయర్ స్వాములు, ఆగమ సలహాదారులు, దేశవ్యాప్తంగా అనేకమంది మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు తీసుకుని వైష్ణవ సంప్రదాయం ప్రకారం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరిస్తూ జూన్ 8వ తేదీ 5 వేల మందితో దర్శనం పునరుద్దరించామన్నారు. కోవిడ్  నిబంధనలు గట్టిగా అమలు చేస్తూనే  ప్రస్తుతం రోజుకు  35 వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.  వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కూడా ఇదే సంఖ్యలో దర్శనాలు పరిమితం చేయాలని నిర్ణయించామని చైర్మన్ తెలిపారు. ఇందుకోసం రోజుకు 20 వేల రూ 300 టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేశామన్నారు. రోజుకు 10 వేల చొప్పున తిరుపతి స్థానికులకు 10 రోజులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్, ప్రోటోకాల్ వీఐపీలకు దర్శనం ఇస్తున్నట్లు చైర్మన్ చెప్పారు.         వైకుంఠ ఏకాదశి శుక్రవారం వస్తున్నందున అభిషేకం అనంతరం ఉదయం 4 గంటలకు ప్రోటోకాల్ వీఐపీలకు, తరువాత,శ్రీవాణి టికెట్ల వారికి దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 7.30 గంటల నుంచే సామాన్య భక్తులకు దర్శనం ప్రారంభిస్తామని అన్నారు.