ఏ ఒక్క నిరుపేద గూడు లేకుండా ఉండకూడదు..
Ens Balu
3
Komaragiri
2020-12-25 20:06:53
నా సుదీర్ఘ 3,648 కి.మీ..పాదయాత్రలో గూడులేని పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని, అందుకే పేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో శుక్రవారం మొదలు 15 రోజుల పాటు పట్టాల పంపిణీ పండగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరి గ్రామంలోని భారీ లేఅవుట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కాచెల్లెమ్మలకు 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు కిరణాల సాక్షిగా పేద మహిళలకు ఇళ్ల పట్టాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి శుభదినాన ఇల్లులేని పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. మొత్తం 28.30 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా తొలిదశలో 15.60 లక్షల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మించనున్నామన్నారు. రూ.50,940 కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సొంత ఇల్లు లేని పేద మహిళలకు 17,005 జగనన్న వైఎస్సార్ కాలనీల్లో లే అవుట్లను అభివృద్ధి చేసి, ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతకంటే నాకు దేవుడు ఇచ్చిన వరం ఏముంటుందన్నారు. ఈ జన్మకు ఇది చాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా సెంటున్నర భూమి, పట్టణ ప్రాంతాల్లో సెంటు నుంచి సెంటున్నర భూమిలో ఇళ్ల పట్టాలను మహిళా లబ్ధిదారులకు దాదాపు 68,361 ఎకరాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.21,345 కోట్ల విలువగల 2.62 లక్షల టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్‌లను కూడా అక్కాచెల్లెమ్మలకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇళ్ల స్థలాల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉండి, ఇల్లు లేనివారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇంటి పట్టా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పేదలకు సొంతింటితో సామాజిక గౌరవాన్ని కల్పిస్తామన్నారు.
కాలనీలు కాదు.. ఊళ్లకు ఊళ్లే రాబోతున్నాయి
కొమరగిరి లేఅవుట్‌ను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ లేఅవుట్‌లో దాదాపు 16,681 ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో వైఎస్సార్ జనతా బజార్, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రం, బస్టాప్, అంగన్‌వాడీ కేంద్రాలు, ఫంక్షన్ హాల్, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కమ్యూనిటీహాల్, పార్కులు తదితరాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల పరిమాణాన్నిబట్టి మురుగునీటి వ్యవస్థ, అప్రోచ్ రోడ్లు, విద్యుత్, తాగునీరు... ఇలా సకల సామాజిక మౌలిక వసతులను ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కనీసం రూ.4 లక్షల మార్కెట్ విలువగల ప్లాటును ఈ రోజు అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నట్లు తెలిపారు. ఓ అన్నగా, తమ్ముడిగా ఉంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని దేవుడు నాతో చేయిస్తున్నందుకు ఎంతో ఆనందపడుతున్నానన్నారు. పక్కా ఇల్లు లేకపోతే కష్టం ఎలా ఉంటుందో పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశానన్నారు. పేదలు తాము సంపాదించిన మొత్తంలో దాదాపు 35 నుంచి 40 శాతం అద్దెలకే చెల్లించి ఎంతో కష్టాలు అనుభవిస్తుండటాన్ని గమనించానన్నారు. చాలీచాలని జీతాలతో బతుకు బండిని లాగిస్తున్న పేదల బతుకులను కళ్లారా చూశానన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేదలకు సొంతిళ్ల అంశాన్ని చేర్చామని, మ్యానిఫెస్టో తనకు ఓ బైబిలు, ఖురాన్, భగవద్గీత అని పేర్కొన్నారు. అందుకే మ్యానిఫెస్టో అమలుకు అహర్నిశలూ కృషిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలు, మతాలు, కులాలు, రాజకీయాలు, వర్గాలు.. ఇలా ఏవీ చూడకుండా అర్హత మాత్రమే ప్రాతిపదికగా అయిదేళ్లలో 25 లక్షల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చామని, కానీ.. అంతకుమించి ఈ రోజు 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు.. అయితే ఇప్పుడు ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి 24 లక్షల మంది జనాభాకు మేలు జరుగుతోందని సగర్వంగా చెబుతున్నాను. 340 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
* అందరూ కలిసి ఉంటేనే అది రాజధాని*
అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారు అందరూ కలిసి ఉండగలిగితేనే అది రాజధాని అవుతుందని, దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అందరికీ చోటిస్తేనే అది సమాజమని, అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వమవుతుందన్నారు. అలాంటి రాజధానిని, సమాజాన్ని, ప్రభుత్వాన్ని దేవుని చల్లని దీవెనలతో తప్పనిసరిగా నిర్మించుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఏ పథకం కావాలి?
టిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టి, మధ్యలో వదిలేసి వెళ్లిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2.62 లక్షల టిడ్కో గృహాలను త్వరలోనే పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరో రూ.9,500 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. 300 చదరపు అడుగుల లోపు ఇంటికయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కేవలం ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు ఇచ్చే జగనన్నపథకం కావాలో.. లేదంటే రూ.2 లక్షల 65వేల బ్యాంకు రుణాన్ని 20 ఏళ్లపాటు వడ్డీతో పాటు రూ.7.20 లక్షలు ఖర్చయ్యే గత ప్రభుత్వ స్కీం కావాలో తేల్చుకోవాలని ముఖ్యమంత్రి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.
ఇంకా ముఖ్యమంత్రి ఏమన్నారంటే:
- అక్కాచెల్లెమ్మలకు లేఅవుట్లను అభివృద్ధి చేసిన 68,361 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.25,530 కోట్లు.
- ఇళ్లను కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ప్రతి లేఅవుట్‌లోనూ ఓ మోడల్ ఇంటిని నిర్మించాం. అదే విధంగా ప్రతి ఒక్కరికీ ఇళ్లను ఇస్తాం.
- ప్రతి ఇంటిలో ఓ బెడ్‌రూం, లివింగ్ రూం, కిచెన్, వరండా, మరుగుదొడ్డి, స్నానాలగది, పైన సింటెక్స్ ట్యాంకు ఉంటుంది. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, రెండు ఎల్ఈడీ బల్బులు వంటివి ఉంటాయి.
- జగనన్న వైఎస్సార్ కాలనీలు ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున 13 లక్షల మొక్కలు నాటుతాం.
- అవినీతికి, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఇళ్ల స్థలాల కేటాయింపు చేశాం. సామాజిక తనిఖీ ప్రక్రియను చేపట్టాం.
- న్యాయపరమైన సమస్యలు తొలగిపోయిన అనంతరం ప్రస్తుతమిస్తున్న హౌస్‌సైట్ పట్టాల స్థానంలో అన్ని హక్కులతో అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తాం.
- రూపాయి లంచానికి కూడా తావులేకుండా 18 నెలల కాలంలో రూ.77 వేల కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశాం.
- నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల పనుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థకు ఊతం తు లభిస్తుంది.
- 1978 నాటి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగామార్చడం జరిగింది. దీనికోసం కృషిచేస్తుంటే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
మూడు ప్రత్యామ్నాయాలు
- ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్లను కూడా కట్టించి ఇవ్వనున్నందున ప్రభుత్వం మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు.
అవి.. 1. నమూనా ఇంటి ప్రకారం ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలను కూడా ఇస్తుంది. లబ్ధిదారుడే ఇల్లు కట్టించుకోవచ్చు.
2. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుడికే దశల వారీగా పూర్తి మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీంతో లబ్ధిదారుడే ఇల్లు కట్టుకోవచ్చు.
3. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని ఇంటిని నిర్మించి ఇస్తుంది. ఈ మూడింటిలో దేన్నయినా లబ్ధిదారుడు ఎంపికచేసుకోవచ్చు. ఇలా ప్రభుత్వమే లబ్ధిదారుడి చేయి పట్టుకొని సొంతింటికి నడిపిస్తుంది.
శుక్రవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా, యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకాన్ని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి స్వాగతం పలుకగా, స్థానిక పిఠాపురం శాసన సభ్యులు పెండెం దొరబాబు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పరిపాలనా వికేంద్రీకరణలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను 2019 అక్టోబరు 2వ తేదీన తూర్పు గోదావరి జిల్లా నుండే ప్రారంభించారని, అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పధకం క్రింద ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్ల మంజూరు బృహత్తర కార్యక్రమాన్ని కూడా ఈ జిల్లా నుండే ప్రారంభించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 17 లక్షల కుటుంబాల్లోని 22 శాతంగా 3 లక్షల 25 వేల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయన్నారు. తొలి దశగా 2,725 కోట్ల వ్యయంతో లక్ష 53 వేల లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయడం అనందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమం కొసం దాదాపు 3168 కోట్లు బడ్జెట్ కేయించి ముఖ్యమంత్రి ఆర్థికమైన, నైతిక మైన మద్దతు కల్పించడంతో కరోనా కలకలం, అధిక వర్షాలు, వరదలు ఎదురైనా లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలిగామని తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ కొమరగిరిలో ఇళ్ల స్థలాలు పొందుతున్న లబ్దిదారులందరూ కాకినాడ సిటీ వారైనా, మంచి కార్యక్రమాన్ని తన నియోజక వర్గంలో ప్రారంభిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, అందరినీ గుండెలలో పెట్టి చూసుకుంటానని తెలిపారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా నాడు డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పవిత్ర క్రిస్టమస్, ముక్కోటి ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినాన ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. దేవుడి దీవనలు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సుల బలంతో ప్రతి పేదకు నిలువనీడ కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి చేపట్టిన సంకల్పాన్ని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అపలేరన్నారు. నియోజక వర్గంలో ఎన్నిక సందర్భంగా 10 వేల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చానని, ముఖ్యమంత్రి దయ వల్ల 31 వేల మందికి నియోజక వర్గ పరిధిలో ఇళ్లు కల్పించే అవకాశం తనకు లభించిందన్నారు.
ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పేదలందరి జీవితాల్లో సామాజిక భద్రత, గౌరవం కల్పిస్తూ సొంతింటి కలను సాకారం చేస్తున్న నవరత్నాలు – పేదలందరికి ఇళ్ల కార్యక్రమం ప్రారంభమౌతున్న ఈ రోజు వారందరికీ నిజమైన పండుగ రోజన్నారు. తొలి విడతగా 15.65 లక్షల ఇళ్లు చేపట్టగా, వచ్చే డిశంబరు నుండి మరో 12 లక్షల ఇల్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. పేదల ఇళ్ల స్థలాల కొరకు స్వచ్చందంగా భూములు అందించిన రైతులందరి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే కార్యక్రమంలో సిసిఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ బృహత్త ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాల మహత్త ఆశయాలను వివరించారు.