ఏయూతో బిఎస్‌ఎన్‌ఎల్ ఎంఓయూ..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-26 20:38:33
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో బిఎస్‌ఎన్‌ఎల్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్, ఎంబిఏ విద్యార్థులకు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను, సాంకేతిక అంశాలపై శిక్షణ అందించే దిశగా ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. శనివారం ఏయూ పాలకమండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్‌షిప్, నైపుణ్య శిక్షణను భాగం చేసిందన్నారు. దీనిని ఏడాదిన్నర క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి ప్రతిపాదించారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి దీనిని ఆచరణలో చూపడం జరుగుతోందన్నారు. విశ్వవిద్యాలయ పరిశోధకులకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. వర్సిటీతో సంయుక్తంగా పరిశోధనలు జరపాలని ఆహ్వానించారు.
బిఎస్‌ఎన్‌ఎల్ పిజిఎం పి.విలియమ్స్ మాట్లాడుతూ దేశానికి మానవ వనరులే సంపదగా నిలుస్తున్నాయన్నారు. వీరికి మెరుగైన నైపుణ్యాలు, సామర్ధ్యాలను అందించే దిశగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉదంన్నారు. విద్యార్తులకు అవసరమైన ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించడంలో బిఎస్‌ఎన్‌ఎల్ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.బిఎస్‌ఎన్‌ఎల్ ఏజిఎం ఎం.సత్యప్రసాద్ శిక్షణలో భాగంగా అందించే శిక్షణ కార్యక్రమాలు, కోర్సు వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.కె భట్టి, అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు, డీన్ ఆచార్య ఏ.భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.