అక్కచెల్లమ్మల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..సీఎం


Ens Balu
3
Srikalahasti
2020-12-28 19:59:02

ప్రతి పథకం అక్క చెల్లెమ్మల పేరుమీదనే మంజూరు చేస్తూ మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశ్యంతో పథకాల రూపకల్పన చేస్తూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఉరందూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప్పొంగిన అభిమానంతో ప్రజల కరతాళ ద్వానుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 25 న వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పండుగ సందర్భంగా గొప్ప కార్యక్రమమైన పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలా 75 వేల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి విడతలో 15 లక్షలా 65 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2 లక్షలా 50 వేల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి విడతలో 1,78,840 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి లో అక్క చెల్లెమ్మలకు పంపిణీ చేస్తున్న భూమి  కి మంచి మార్కెట్ విలువ కలదని, అధికారం లోకి వచ్చిన 18 నెలల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రతి పథకం మహిళల పేరుమీదనే రూపకల్పన చేస్తున్నామని, మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మహిళలను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది అర్హులైన తల్లుల ఖాతాల్లోకి రూ. 6,350 కోట్లు, విద్యా దీవెన పథకం కింద 18 లక్షలా 52 వేల మందికి రూ. 4వేల కోట్లు, వసతి దీవెన పథకం కింద 15 లక్షలా 56 వేల మంది తల్లులకు రూ. 1,221 కోట్లు, వై.ఎస్ ఆర్ ఆసరా కింద ప్రతి పొదుపు సంఘం లో ఉన్న 87 లక్షలా 74 వేల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6792 కోట్లు, వై.ఎస్.ఆర్ చేయూత కింద 24 లక్షలా 55 వేల మందికి రూ.4604 కోట్లు,  పొదుపు సంఘాలలో ఉన్న 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వారి తరఫున వడ్డీ 1400 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని, కాపు నేస్తం కింద 3 లక్షల 28 వేల మందికి రూ. 491 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇలా ప్రతి పథకం ద్వారా పొందే లబ్ధి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. వీటితో పాటు మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారిని అభివృద్ధి చేసేందుకు రాజకీయ పదవుల్లో కూడా 50 శాతం వారికి కేటాయించడం జరుగుతోందని తెలిపారు.              ఎన్నికల మ్యానిఫెస్టోలో 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని తెలుపగా ప్రస్తుతం 31 లక్షల పక్కా ఇండ్లు ఇస్తున్నామని సగర్వంగా తెలిపారు. ఇంకనూ అర్హత ఉండి ఇళ్ళు పొందని నిరుపేదలు ఉంటే సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఒక్క రూపాయ కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ వై.ఎస్. జగనన్న కాలనీని ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, ఈ కాలనీ లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 7 వేల కోట్ల పై చిలుకు ఖర్చు అవుతుందని తెలిపారు. గతం లో 224 చ. అడుగులతో ఇండ్ల నిర్మాణం మహిళలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం 340 చ. అడుగులతో ఇళ్ళ నిర్మాణం చేపట్టామని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే 68 వేల 361 ఎకరాలు భూమిలో లేఔట్లు వేసి అభివృద్ధి చేసి ఇస్తున్నామని వీటి మార్కెట్ విలువ రూ. 25 వేల 530 కోట్లు ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాలలో ఒకటి నుండి 1.5 సెంట్లు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రతి లేఔట్ లోనూ మోడల్ ఇళ్ళు నిర్మించడం జరుగుతున్నదని, ప్రతి ఇంట్లో ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్, వరండా, టాయ్లెట్ వంటి సౌకర్యాలతో పాటు రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబు లైట్లు, రెండు ఎల్ ఈ డి బల్బులు పచ్చదనం పెంచేందుకు ప్రతి ఇంటికీ మొక్కల పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఇండ్ల పట్టాల పంపిణీ రోజే వారి స్థలాన్ని వారికే కేటాయించి ఆరోజే వారికి స్వాధీనం చేయడం ఎప్పుడూ జరగలేదని తెలిపారు. మొదటి దశలో 15 లక్షలా 25 వేల ఇళ్ల నిర్మాణం, రెండవ దశ వచ్చే సంవత్సరం లో మొదలవుతుతుందని, టిడ్కో కింద లబ్ధిదారుల ఆప్షన్ మేరకు కేవలం ఒక్క రూపాయతో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఆప్షన్ లలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నా ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతుందని, లబ్ధిదారుల పేరు పైన ఉన్న ఇళ్ళు 5 సం. ల తరువాత ఇళ్ళు అమ్ముకోవడానికి బ్యాంకు లోను తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం న్యాయ పరమైన ఇబ్బందులు ఉన్నందున ప్రస్తుతం డి ఫామ్ పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదని, అడ్డంకులు తొలగిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు 30 రకాల వృత్తిదారులకు ప్రత్యక్ష మరియు పరోక్షంగా పని ఏర్పడుతుందని తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని తెలిపారు.           ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన పుష్ప, జ్యోతి, ధనలక్ష్మి, సృజనీ, రజియాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.           ఈ కార్యక్రమం మొదట జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా ముఖ్యమంత్రి దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.           ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణ దాస్, గృహ నిర్మాణ శాఖామాత్యులు రంగనాథ రాజు, ఎంపీ లు రెడ్డెప్ప, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ‌పి‌ఐఐసి చైర్ పర్సన్ రోజా, శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, కరుణాకర రెడ్డి, ఆదిమూలం, నవాజ్ బాషా, ద్వారకనాథ రెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి, వెంకటే గౌడ్, ఆరణి శ్రీనివాసులు, ఎం ఎస్ బాబు, ముఖ్యమంత్రి పర్యటన పరిశీలకులు తలశీల రఘురాం సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉషారాణి, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, జాయింట్ కలెక్టర్లు డి. మార్కండేయులు, వి. వీరబ్రహ్మం, రాజశేఖర్, డిఆర్ఓ మురళి, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.