ఏపీ చరిత్రలోనే భారీగా తగ్గిన ప్రెస్ అక్రిడిటేషన్లు..
Ens Balu
3
Tadepalli
2020-12-30 10:31:47
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గింది.. సమాచారశాఖ 2021-22 సంవత్సరానికి ఇచ్చే అక్రిడిటేషన్లు ఏపీలోని 13 జిల్లాల్లో తొలివిడతలో భారిగా పడిపోయాయి. అంటే ఇక్కడ మీడియాకి, పత్రికలకు అక్రడిటేషన్లు తగ్గించినట్టు కాదు. ఖచ్చితంగా ఆర్ఎన్ఐ నిబంధనలు పాటించిన మీడియా సంస్థలకు మాత్రమే ప్రభుత్వం ఆన్ లైన్ లో అన్నిరకాల అనుబంధ పత్రాలను జతచేసిన వారికి తొలివిడతలో ఈ విధంగా అక్రిడిటేషన్లు జారీ చేసింది. గతంలో కార్డులు ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ఆన్ లైన్ నుంచే కార్డులు డౌన్ లోడ్ చేసుకోమని చెబుతోంది. ఇప్పటి వరకూ కొన్ని జర్నలిస్టు సంఘాల ప్రాభవాలతో సమాచారశాఖలలోని అధికారులను ప్రసన్నం చేసుకొని మరీ సంపాదించే అక్రిడిటేషన్లు ఇకపై ఆవిధంగా వచ్చే పరిస్థితిలు లేకుండా పోయాయి. ఖచ్చితంగా ప్రతినిత్యం పత్రిక ముద్రించి సరఫరా చేసే మీడియా సంస్థలకు మాత్రమే అక్రిడిటేషన్లు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను కఠిన తరం చేసింది. ఇక జిల్లాస్థాయి అక్రిడిటేషన్ పొందాలంటే మినిమమ్ విద్యార్హత డిగ్రీ చేయడం కూడా విశేషం. అయితే ఇందులో వరుసగా మూడేళ్లు అక్రిడిటేషన్ ఉంటే డిగ్రీ విద్యార్హతలో మినహాయింపు ఇచ్చారు. అదే విధంగా మండల స్థాయిలో అక్రిడిటేషన్ కు కూడా మినిమమ్ ఇంటర్మీడియట్ విద్యార్హతగా పెట్టి మూడేళ్లు అక్రిడిటేషన్ ఉంటే విద్యార్హతగా చాలన్నట్టుగా జీఓను జారీ చేసింది ప్రభుత్వం. దీనితో అన్ని రకాల అనుబంధ పత్రాలు వున్నవారందరికీ తొలివిడతలో అక్రిడిటేషన్లు మంజూరయ్యాయి. మిగిలిన వారి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచారు. అంటే వారు ఏ తరహా అనుబంధ పత్రాలు ఆన్ లైన్ లో సమర్పించలేదో చూసి వారికి మరో అవకాశం ఇచ్చి మిగిలిన అన్నిరకాల పత్రాలు అందించేందుకు అవకశాలు కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈలోగానే మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టుల్లో ఆందోళన మొదలైంది. దానికితోడు పత్రిక ముద్రణా కేంద్రంలో 300 ప్రతులు, మండల కేంద్రంలో 100 ప్రతులు, నియోజవర్గ కేంద్రాల్లో 300 ప్రతులు అమ్ముతున్నట్టు తహశీల్దారు వద్ద ద్రువీకరణ పత్రాలు సమర్పించాలనే నిబంధనలు పెట్టడం కూడా జర్నలిస్టులు, చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలకు ఇబ్బందిగా మారింది. కొన్ని మీడియా సంస్థలు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాలుగా అమలు చేస్తున్నవారందరూ తొలివిడతలోనే అక్రిడిటేషన్లు పొందటం విశేషం. ఒక రకంగా ప్రభుత్వం కూడా ఆర్ఎన్ఐ నిబంధనలకు అనుగుణంగా పత్రికలు నిర్వహిస్తేనే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పకనే చెప్పింది. దీనిపై జర్నలిస్టు సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్దస్థాయిలో ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయంది. విశేషం ఏంటంటే దేశ రాజధాని పీఐబీల న్యూఢిల్లీలోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లు ఇచ్చే నిబంధనల కంటే ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలు చాలా గట్టిగా అమలు చేయడం విశేషం. అదే సమయంలో ఎవరైనా జర్నలిస్టు ఒక మీడియా సంస్థలో మానేసిన సమయంలో ఆ స్థానంలో కొత్తగా వచ్చిన వ్యక్తికి ప్రెస్ అక్రిడిటేషన్ ఇచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. నిబంధనలు అమలు చేసినపుడు, మానేసిన జర్నలిస్టు స్థానంలో మరొక జర్నలిస్టు చేరినపుడు ఆయనకు నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు ఇవ్వాల్సి వుంది. మరీ ముఖ్యంగా రూ.40 లక్షలు టర్నోవర్ దాటని సంస్థలను కూడా జీఎస్టీ నెంబరు తీసుకోమనడం, వాటికి రిటర్న్స్ దాఖలు చేయమనడం కూడా విస్మయాన్ని కలిగిస్తుంది. కేంద్రప్రభుత్వమే రూ.40లక్షలు లోపుగా ఉంటే జీఎస్టీ అవసరం లేదని చెబుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ విధంగా ప్రెస్ అక్రిడిటేషన్ల జారీకి జీఎస్టీ లింకు పెట్టడం వలన మీడియా సంస్థలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చిన్న, మధ్య తరహా పత్రికల యాజమాన్యాలు. మొత్తంగా చూసుకుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీడియా సంస్థలు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తే తప్పా అక్రిడిటేషన్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పడంతో...ఆంధ్రప్రదేశ్ ప్రెస్ చరిత్రలో ఒక్కసారిగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్లు సంఖ్యలో భారీగా కోత పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో కొన్ని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాలతో చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోవడం కొసమెరుపు..!