సంక్షేమ పథకాలు కోల్పోయిన జర్నలిస్టులు..


Ens Balu
3
Tadepalle
2020-12-31 08:51:34

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోయారు.. అవును మీరు చదువుతున్నది నిజమే.. దానికి కారణం చిన్న, మధ్య తరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు నిర్వహించే జర్నలిస్టులు ప్రభుత్వానికి నివేదించడానికి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడమే. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం గ్రామ, వార్డు వాలంటీర్లు సర్వే చేసే సమయంలో ఆథార్ కార్డులు నమోదు చేస్తున్న సమయంలో 70శాతం జర్నలిస్టు కుటుంబాలందరికీ ఆదాయ పన్ను కడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయపు పన్ను కడితే సంపన్నులుగా లెక్క. దీనితో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బియ్యం కార్డులు రద్దైపోయాయి, గ్రామాల్లో ఇచ్చే ఇళ్లును వదులుకోవాల్సి వచ్చింది..గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను కూడా ఈ ప్రభుత్వంలో కోల్పోవలసిన దుస్థితి ఏర్పడింది.  ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయ పన్ను చెల్లించినట్టు ఆథార్ ద్వారా రుజువైతే వారు లక్షాధికారులు, కోటీశ్వరులు కింద ప్రభుత్వం లెక్కలు వేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసింది. నిజంగా లక్షాధికారులు, కోటీశ్వరులు అయితే పొట్టగూడికోసం  చిన్న, మధ్య తరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీల ఎందుకు నిర్వహిస్తారనే చిన్న సాంకేతిక అంశాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దైపోయినా.. పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు నిర్వహణకు నెలకు వేల రూపాయలు(కరెంటు బిల్లు, ఇంటర్నెట్, టెలీఫోన్, , ట్రాన్స్ పోర్టుకి  బైకులకు పెట్రోలు, కంప్యూర్ ఆపరేటర్ లేదా డిటిపి ఆపరేటర్ లేదా సబ్ ఎడిటర్ జీతాలు) రూపాయలు నిర్వాహకులు చెల్లించి సంస్థలు నిర్వహించినా ప్రభుత్వంలోని సమాచార శాఖ నిబంధనల ప్రకారం ఎంపానల్ మెంట్ గానీ, అక్రిడిటేషన్లు గానీ సమయానికి ఇవ్వడం లేదు. దీనితో జర్నలిస్టులు అటు ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు కోల్పోవడంతోపాటు ఇటు సమాచారశాఖ గుర్తింపు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కూడా ప్రభుత్వానికి జర్నలిస్టుల సాంకేతిక సమస్యలను కూడా వివరించడం లేదు. ఎంతసేపూ వారి ప్రాభవం కోసం నేతలకు, సమాచారశాఖ అధికారులకు భజన చేయడానికే సమయం అంతా సరిపోతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పత్రికలకు, న్యూస్ ఏజెన్సీలకు జిఎస్టీ రిటర్న్స్ కూడా దఖలు చేయాలని నిబంధన విధించడం మరింత విపరీత పరిణామంగా దాపురించింది. జిఎస్టీ కారణంగా ప్రకటనలపై ఆదాయం వచ్చినా, రాకపోయినా ప్రతీ 3నెలలకు ఒకసారి నిల్ రిటర్న్స్ సైతం ప్రభుత్వానికి చూపించాల్సి వుంది. ఆ సమయంలో చార్టెడ్ అకౌంటెంట్ కి ఒక సారి రిటర్న్స్ వేస్తే ప్రతీ మూడు నెలలకు రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. ఇలా అంతా అదనపు భారంగానే పత్రికలు, న్యూస్ ఏజెన్సీలకు చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ చేసినా ప్రభుత్వం చిన్న పత్రికలను, న్యూస్ ఏజెన్సీలను గుర్తించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన పాపానికి వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోవడం మాత్రం ప్రభుత్వానికి కనిపించలేదు. వాస్తవాలు తెలియజేసే క్రమంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రభుత్వానికి జర్నలిస్టుల సమస్యలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నది..!