భక్తిభావాన్ని పంచిన పారాయ‌ణం..


Ens Balu
2
Tirumala
2021-01-02 14:11:58

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌ని‌‌వారం ఉద‌యం సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న 196 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితులు అఖండ పారాయ‌ణం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిభావాన్ని పంచింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ 8వ‌ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ, రామనామం ఎక్కడ పలికితే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని, హనుమంతుని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు నెరవేరుతాయని చెప్పారు. రాముడు ఆచ‌రించిన ధ‌ర్మం లోకానికి ర‌క్ష అని, వేదోక్త‌మైన ధ‌ర్మా‌న్ని ఆచ‌రించ‌డం వ‌ల‌న ప్ర‌పంచంలోని మానవులు సిరిసంపదలు, ఆయురారోగ్యాల‌తో ఉంటార‌ని వివరించారు.            ఇప్ప‌టివ‌ర‌కు ఏడు విడ‌త‌ల్లో అఖండ పారాయ‌ణం జ‌రిగింది. జూలై 7న‌ మొద‌టి విడ‌త‌లో మొద‌టి స‌ర్గ‌లోని 211 శ్లోకాలు, ఆగ‌స్టు 6న రెండో విడ‌త‌లో 2 నుండి 7వ స‌ర్గ వ‌ర‌కు 227 శ్లోకాలు, ఆగ‌స్టు 27న మూడో విడ‌త‌లో 8 నుండి 11వ స‌ర్గ వ‌ర‌కు 182 శ్లోకాలు, సెప్టెంబ‌రు 12న నాలుగో విడ‌త‌లో 12 నుండి 14వ స‌ర్గ వ‌ర‌కు 146 శ్లోకాలు, అక్టోబ‌రు 4న ఐద‌వ విడ‌త 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు 174 శ్లోకాలను, నవంబరు 3న ఆరో విడ‌త 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు185 శ్లోకాలు, డిసెంబ‌రు 6న ఏడ‌వ విడ‌త 25వ‌‌ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను  అఖండ పారాయ‌ణం జ‌రిగింది.             కాగా టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు  సుష్మ బృందం  " ఎదురా ర‌ఘుప‌తికి ...... " ‌, అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో,  ర‌ఘునాథ్ బృందం " శ్రీ హ‌నుమ జ‌య హ‌నుమ శ్రీ హ‌నుమ జ‌య హ‌నుమ‌......" అనే  సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.        ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, జాతీయ సంస్కృత వర్సిటి ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ దంప‌తులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు  ద‌క్షిణామూర్తి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి  విభీష‌ణ శ‌ర్మ‌ తదితరులు పాల్గొన్నారు.