ఇళ్ల పట్టాల పంపిణీలోనూ విజయనగరమే టాప్1..
Ens Balu
3
Vizianagaram
2021-01-05 13:33:35
నిరుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. నవరత్నాలులో భాగంగా పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నెంబరు 1 స్థానంలో నిలిచింది. జిల్లాలో డిసెంబరు 25 న ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం, 30న ముఖ్యమంత్రి రాకతో మరింత ఊపందుకొని, ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. కొన్ని పెద్ద కాలనీలు మినహా, సుమారు 78శాతం జగనన్న కాలనీల్లో పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తి అయ్యింది. పేదలు ఏళ్లతరబడి కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రభుత్వ ఉత్తుర్వులు మరకు, మంత్రుల సూచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పర్యవేక్షణలో పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడి ఎంఎల్ఏలు, మంత్రుల చేతులమీదుగా పట్టాల పంపిణీ జరుగుతోంది. విజయనగరం నియోజకవర్గంలో డిసెంబరు 30న జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి పాల్గొని తన చేతులతో పట్టాలను పంపిణీ చేయడం ద్వారా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్లలో ఒకటైన గుంకలాం లేఅవుట్‌లో 12,301 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులంతా ప్రతీరోజూ ఉత్సాహంగా పట్టాలను పంపిణీ చేస్తూ, పేదల ఆశలను నిజం చేస్తున్నారు. చాలాచోట్ల పట్టాలతోపాటుగా ఇళ్లును కూడా ప్రభుత్వం మంజూరు చేయడంతో, మరోవైపు లబ్దిదారులు పునాదులు తవ్వేందుకు కూడా సన్నద్దమవుతున్నారు.
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద జిల్లాలో 72,625 మందిని కొత్తగా ఇళ్ల పట్టాల పంపిణీకి అర్హులుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరిలో 4వ తేదీ నాటికి సుమారు 39,772 మందికి పట్టాలను పంపిణీ చేయడం పూర్తయ్యింది. కొన్నిచోట్ల జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎంఎల్ఏల చేతులమీదుగా పట్టాల పంపిణీ జరగ్గా, మరికొన్ని చోట్ల వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి మరీ, లబ్దిదారులకు భద్రంగా పట్టాలను అందజేస్తున్నారు. టిట్కో ఇళ్లకు సంబంధించి జిల్లాలో 8,048 మందిని అర్హులుగా గుర్తించగా, వీరిలో 5,207 మందికి ఇప్పటికే వాటికి సంబంధించిన పత్రాలను అందజేయడం జరిగింది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద పట్టాల పంపిణీకి జిల్లాలో 1164 లేఅవుట్లను రూపొందించి, జగనన్న కాలనీలను అన్ని హంగులతో పంపిణీకి సిద్దం చేయగా, వీటిలో 911 కాలనీల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ పూర్తి చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ఆక్రమిత స్థలాల రెగ్యులైజేషన్, పొజిషన్ పట్టాల పంపిణీ, కోర్టు పత్రాల పంపిణీలో కూడా ఇతర జిల్లాల కంటే విజయనగరం జిల్లా ఎంతో ముందంజలో ఉంది. ఆక్రమిత స్థలాల రెగ్యులైజషన్, పొజిషన్ పట్టాలకు సంబంధించి మొత్తం 25,274 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటికే 19,572 మందికి పొజిషన్ సర్టిఫికేట్లను అందజేశారు. కోర్టు కేసుల కారణంగా పెండింగ్ లో ఉన్న పట్టాల పంపిణీకి సంబంధించి, 47శాతం మందికి ఇప్పటికే లేఖలను అందజేయడం పూర్తయ్యింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ సొంతింటి కల సాకారం అవుతుండటంతో, లబ్దిదారుల ఇళ్లలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయ్యింది.