అక్రిడిటేషన్ల కోసం కమిషనర్ కార్యాలయం ముట్టడి..


Ens Balu
2
Vijayawada
2021-01-05 20:49:51

అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ దక్కేవరకూ గళం తగ్గించేది లేదని ఏ.పి.యు.డబ్ల్యు.జే. అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం సమాచారశాఖ కార్యాలయంలో బైటాయించి తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అనేక వర్గాల ప్రజలకు ఏన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల దగ్గరకు వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. రాజన్నరాజ్యం తెస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్  ఆనాడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి అమలుచేసిన అక్రెడిటేషన్ విధానాన్ని ఎందుకు మారుస్తున్నారో  చెప్పాలన్నారు. 142 జీఓ లోని  నియమాలన్నీ వై.ఎస్. విధానానికి విరుద్ధమైనవని అన్నారు. వై.ఎస్. విధానం తప్పని చెప్పదలచుకున్నారా అని సూటిగా  ప్రశ్నించారు. అక్రెడిటేషన్ విధానాన్ని  సరళతరం చేసి నిజంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ  గుర్తింపుఇవ్వాలన్నారు. ఐ.జే.యు. జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా నేపథ్యం లో పత్రికా రంగం ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం పాత్రికేయుల పై సానుభూతి తో వ్యవహరించాలని కోరారు. ఐ.జే.యు.జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ  142 జీఓ పత్రికా రంగంలోని వాస్తవిక స్తితిగతులకు విరుద్ధంగా ఉందన్నారు.  జి.ఎస్.టి., సర్క్యు లేషన్ వంటి వ్యాపార  అంశాలతో పాత్రికేయ వృత్తిని కొలవడం సమంజసం కాదని అన్నారు. ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులలో వ్యక్తమవుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని అక్రెడిటేషన్ విధానాన్ని మార్చాలని కోరారు. కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి తన చాంబరునుండి కారిడార్ లోకి వచ్చి యూనియన్ నాయకులు అందచేసిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. చర్చలకు రావాల్సిందిగా నాయకులను కోరారు. చర్చలఅనంతరం అధ్యక్షుడు  ఐ.వి.సుబ్బారావు  మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ ఇచ్చిన హామీల అమలును పరిశీలిస్తామని  జర్నలిస్టులకు న్యాయంజరగని పక్షంలో యూనియన్ తన  ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.