ప‌ర్యాట‌క అభివ్రుద్ధికి ప్రత్యేక ప్ర‌ణాళిక‌..


Ens Balu
1
Visakhapatnam
2021-01-08 15:38:22

  రాప్ట్రంలో పర్యాటక రంగం పురోగతికి కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లో రూపొందించాలని రాప్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు కోరారు.  శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన పర్యాటక  శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పర్యాటక రంగం తీవ్ర సంక్షోభానికి గురి అయిందని, ప్రస్తుతం  సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్యాకేజీలను తయారుచేయాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.   ఎపిటిడిసి ద్వారా అరసవెల్లి, శ్రీకూర్మం తదితర పుణ్యక్షేత్రాలకు టూర్ ప్యాకేజీలను రూపొందించి ప్రచారం చేయాలని తెలిపారు.  విశాఖ నగరంలో రామకృష్ణా బీచ్ రోడ్డులో పర్యాటక సమాచార కేంద్రాన్ని , జివియంసి అధికారులతో  సమన్వయంతో  సత్వరమే ఏర్పాటు చేయాలని అధికారులను  ఆదేశించారు. జి.వి.ఎం .సి ,  జిల్లా పరిషత్, వి ఎం ఆర్ డి ఎ  అధికారులతో  సంప్రదించి పర్యాటకులకు  ఆహ్లదం కలిగించే  సాంస్కృతిక  కార్యక్రమాలను  నిర్వహించాలని  కోరారు.   ఎ పి టి డి సి హోటళ్ల గురించి  విస్తృత ప్రచారం  చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ పర్యాటక  అభివృద్ది సంస్థ  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ,  ఆర్ డి రాం ప్రసాద్, డి వి ఎం ప్రసాద్ రెడ్డి, ఈఈ రమణ,  డి టి ఓ లు, డిఈ,  ఎఈ లు పాల్గొన్నారు.