ఆరోగ్య మార్గ‌ద‌ర్శ‌కాలు తెలుగులో విడుద‌ల‌..


Ens Balu
1
Visakhapatnam
2021-01-08 15:49:18

 ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  ఆగష్టు 2019 న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భముగా ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం లో భాగంగా వయస్సుకి తగ్గ ఆరోగ్యనియమాలు మరియు మార్గదర్శకాలు తెలుగు భాషలో  విడుదల చేస్తున్నట్లు పర్యాటక, యువజన సంక్షేమ, క్రీడా శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు   తెలిపారు.  శుక్రవారం  క్యాంపు కార్యాలయం నుండి  మార్గదర్శకాలు  వర్చువల్ లాంచ్ చేసి  వీడియో  కాన్పరెన్స్ ద్వారా  క్రీడా  శాఖాధికారులతో   సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ మన దైనందిన జీవన శైలిలో  భాగంగా వయస్సుకు తగిన వ్యాయామం మరియు యోగాసనాలు అవలంభించడంలో మనల్ని ప్రేరేపించడానికి ఫిట్ ఇండియా ఉద్యమం దారి తీస్తుందని అన్నారు. .ఫిట్ ఇండియా ఉద్యమములో భాగముగా పాఠశాల పిల్లలు ,స్కూల్ వీక్ ,ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ మరియు ఫిట్ ఇండియా ఆక్టివ్ డే సిరీస్లు భాగముగా వున్నాయి అని తెలిపారు.  సుమారు 2.5 లక్షల పాఠశాలలు  ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ కోసం రిజిస్టర్ చేయ బడివున్నవని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వతహాగా  క్రీడాకారులని,  ఆయన  ప్రతి నిత్యం  వ్యాయామం చేస్తారని   తెలిపారు.  క్రీడారంగ అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రత్యేక  శ్రద్ద తీసుకుంటున్నారని  తెలిపారు.  మనిషి  జీవితంలో ఒత్తిడి  పెరిగిపోయిందని, పిల్లలు స్వల్ప కారణాలకే ఆత్మహత్యా చేసుకుంటున్నారని, దీనిని  అధిగమించడానికి   మన  ప్రాచీన  వారసత్వాలైన యోగా , ప్రాణాయామం ఆచరించాలని  కోరారు.  ప్రతిరోజూ 30-60 నిముషాలు పాటు విస్తృతంగా శారీరకంగా పని చేయడాన్ని నిర్ధారించే సాధారణ మార్గదర్శకాలు నియమాలు ఇందులో  రూపొందించ బడ్డాయని  తెలిపారు. ప్రస్తుత సమయంలో దీర్ఘకాల వ్యాధులు,  సంక్రమితం కానీ వ్యాధుల వలన మారుతున్న ప్రజల లక్షణాల వివరాలు,వ్యాధుల భారం మరియు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యాయామాలతో మరింత సమగ్రమయిన ప్రాధమిక ఆరోగ్య సంరక్షణని అందించే దిశగా ఫిట్ ఇండియా ఉద్యమం దోహదం చేస్తుందని తెలిపారు.  వయస్సుకి తగ్గ ఈ ఆరోగ్య నియమాలు మరియు మార్గదర్శకాలు మూడు రకాల వయస్సులకు చెందిన సమూహాలు  అనగా 5-18 సంవత్సరాలు, 18-64 సంవత్సరాలు మరియు 65సంవత్సరాలు    పైబడిన వారి కి  ఉద్దేశించినవని తెలిపారు. సామాన్య పౌరుడు సైతం ఆరోగ్యాన్ని ఒక అంతర్భాగముగా చేయటానికి  సరళమైన, సులభమైన ఆరోగ్య నియమాలు పాటించడానికి ఈ ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా శారీరక ఆరోగ్యాభివృధి చేసుకొనుటకు మార్గదర్శకం అవుతుందని అన్నారు.  కుమారసంభవం, శాకుంతలం కావ్యాలలో  మహాకవి కాళిదాసు వివరించిన విధముగా అన్ని మంచి పనులకు శరీరమే ఒక సాధనమని అన్నారు.  అటు వంటి శరీర పరిరక్షణే లక్ష్యంగా ఈ ఉద్యమం   సాగుతుందని తెలిపారు.  విజయవాడ నుండి క్రీడా  శాఖ  ముఖ్య కార్యదర్శి  కె.రాంగోపాల్  మాట్లాడుతూ  ఆరోగ్య నియమాలు, మార్గదర్శకాలను  తెలుగులో ముద్రించి  ప్రజలకు అందుబాటులో  ఉంచుతామని  అన్నారు. స్పోర్ట్స్ ఆథారిటి  మేనేజింగ్ డైరక్టర్  బి.రామారావు  మాట్లాడుతూ విశాఖ నగరంలోని కొమ్మాది స్టేడియం ను  త్వరలో   అభివృద్ది  చేస్తామని   తెలిపారు. ఇంకా డిల్లీ నుండి  ఫిట్ ఇండియా మిషన్  డిప్యూటి డైరక్టర్  విష్ణు సుధాకరన్,  బెంగుళూరు నుండి  స్పోర్ట్స్  ఆథారిటి  ఆఫ్ ఇండియా  దక్షణ ప్రాంత  అసిస్టెంట్ డైరక్టర్  ఎస్. హిమబిందు  పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి డి ఇ ఓ లింగేశ్వరరెడ్డి, సెట్విస్  సి ఇ ఓ  శ్రీనివాసరావు, చీఫ్ కోచ్  సూర్యారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.