రాష్ట్రంలో తెలుగు భాషా వికాసానికి కృషి..
Ens Balu
1
Kakinada
2021-01-20 18:53:40
రాష్ట్రంలో తెలుగు భాషా వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి తెలుగు భాషా,సంస్కృతి అభివృద్ది కమిటీ చైర్మన్ మొహ్మద్ అహమ్మద్ షరీఫ్ అన్నారు.బుధవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన తెలుగు భాషా,సంస్కృతి అభివృద్ది కమిటీ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ తెలుగు భాష తల్లి లాంటిదని,తెలుగు భాష ను ప్రతి ఒక్కరూ ప్రేమించి,అభిమానించాలని సూచించారు.రాష్ట్రంలో తెలుగు భాషా వికాసానికి చేపట్టవలసిన చర్యలు,ప్రస్తుతం తెలుగు భాష అమలవుతున్న తీరు ను పరిశీలించడం తో బాటు క్షేత్ర స్థాయిలో వున్న ఇబ్బందులను గుర్తించి వాటిని సరిచేసేందుకు సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని కమిటీ చైర్మన్ తెలియ చేసారు. అలాగే క్షేత్ర స్థాయిలో తెలుగు సంస్కృతి,సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి,ప్రజల ఆకాంక్ష ల మేరకు తెలుగు భాషా పురోభివృద్ధి ఎలా వుందీ పరిశీలించడం తో బాటు తెలుగు భాష ప్రాభల్యం,ప్రతిష్ట తగ్గకుండా ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు కమిటీ రావడం జరిగిందని చైర్మన్ తెలిపారు.మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషా భివృద్దికి పటిష్టమైన చర్యలు తీసుకుని భావి తరాలకు అందించాలనేది ప్రధాన లక్ష్యమని చైర్మన్ తెలిపారు.అలాగే మనకు ముందు తరాలవారు,మహా కవులు తెలుగు భాషాభివృద్ధికి ఎంతో శ్రమించారని,అలాగే ప్రజాప్రతినిధులు,అధికారులు తెలుగు భాషాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని అందుకు అనుగుణంగా కృషి చేయాలని చైర్మన్ సూచించారు.తంజావూరు లో వున్న సరస్వతి గ్రంథాలయంలో 2300 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని తమిళ్నాడు ప్రభుత్వం వాటిని కంప్యూటకరించి(డిజిటి లైజేషన్) ఎంతో జాగర్తగా భద్రపరచడం జరిగిందని,చైర్మన్ తెలియ చేసారు.మన తెలుగు భాష పై ఇతర రాష్ట్రాల వారు కూడా ఎంతో మక్కువ చూపుతున్నప్పుడు మన మాతృభాషను మనం ఎంతగానో ప్రోత్సహించవలసిన అవసరం ఎంతో వుందని చైర్మన్ తెలిపారు.సమావేశంలో కమిటీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు,ఉపాధ్యాయ ఎం.ఎల్.సి వి.బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుకి శ్రీకారం చుట్టిన మహా పుణ్యక్షేత్రం రాజమహేంద్రవరమని అభివర్ణించారు.మొదటి నవల,మొదటి పురమందిరం,మొదటి జీవిత చరిత్ర వాటికి ప్రతి రూపాలుగా వున్న వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడం తో బాటు,అలాగే గ్రంథాలయాల్లో వున్న ప్రాచీన గ్రంధాలు వారసత్వ సంపద అని వాటిని భద్రప రచవలసిన ఆవశ్యకత ఎంతో వుందని సుబ్రహ్మణ్యం అన్నారు.అలాగే తెలుగు వారసత్వాన్ని నిలబెట్టే వ్యవస్థల పై ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కాలేజియేట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్.డేవిడ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లో 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని వీటికి 31 తెలుగు అధ్యాపక పోస్టుల మంజూరు చేయగా అందులో 10 మంది రెగ్యులర్ అధ్యాపకులు వున్నారని, ఆరుగురు కాంట్రాక్ట్ బేసిస్ పై పనిచేస్తున్నారని, 15 మంది గెస్ట్ ఫాకల్టీ గా పని చేస్తున్నారని తెలిపారు.రాజమండ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఎం. ఏ తెలుగు,బి. ఏ స్పెషల్ తెలుగు వుందని, 80 శాతం విద్యార్థులు తెలుగును సెకండ్ లాంగ్వేజ్ గా తీసుకున్నారని తెలిపారు.12 మంది పి.హెచ్.డి రీసెర్చ్ స్కాలర్స్, నలుగురు రీసెర్చ్ గైడ్ లు వున్నారని తెలిపారు.కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ పరిశోధనా కేంద్రం రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్ సహాయక సంచాలకులు కె.తిమ్మరాజు మాట్లాడుతూ 5 వేల ప్రాచీన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని,500 చేతి ప్రతులు, రాగిరేకుల శాసనాలు ఉన్నాయని తెలుపగా కమిటీ సభ్యులు వాటిని డిజిటిలైజేషన్ చేసి భద్రపరచాలని సూచించారు.మరో కమిటీ సభ్యులు,కడప,అనంతపురం కర్నూలు ఎం.ఎల్.సి. కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న తెలుగు భాషా వికాసం కోసం కమిటీ విశేషం గా కృషి చేస్తోందని, ఇ తర రాష్ట్రాల్లో తెలుగు కు ప్రాధాన్యత ఎంతో వుందని,అక్కడ మనకు సంభందించిన ప్రాచీన గ్రంధాలను ఎంతో క్రమపద్ధతిలో భద్రపరిచారని,మనం కూడా అదే మాదిరిగా మన వారసత్వ సంపద అయిన గ్రంథాలను పరిరక్షించు కోవలసిన అవసరం వుందని అన్నారు. మరో కమిటీ సభ్యులు,ఉత్తరాంధ్రకు సంభందించిన ఎం.ఎల్.సి. పి.వి.ఎన్.మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగాక తెలుగు విశ్వవిద్యాలయం విభజన కాలేదని,బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయం పరిస్తితి దయనీయం గా వుందని,శ్రీశైలంలో కూడా ఇదే పరిస్థితి వుందని అన్నారు. బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయానికి పునరజ్జీవణం తీసుకు రావలసిన అవసరం వుందని అన్నారు.అలాగే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన గౌతమి గ్రంధాలయం అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయవలసిన అవసరం వుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పాల్గొన్నారు.ఇతర శాఖల అధికారులు తెలుగు భాషాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కమిటీకి వివరించారు.సమావేశం అనంతరం కమిటీ సభ్యులు రాజమహేంద్రవరం లోని గౌతమి ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడ భద్రపరిచిన ప్రాచీన తాళపత్ర గ్రంథాలను,ఇతర గ్రంథాలను పరిశీలించారు.అనంతరం తెలుగు విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడ తెలుగు భాషాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.