గాల్లో జర్నలిస్టుల ఎలక్షన్ కమిషన్ పాసులు..
Ens Balu
3
తాడేపల్లి
2021-01-29 16:46:10
ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరువుని ఎన్నికల కమిషన్ దగ్గర మరోసారి తీయాలనే కంకణం కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయకుండా, అటు ఎలక్షన్ కమిషన్ పాసులు జర్నలిస్టులకు రాకుండా చేయగలిగింది. వాస్తవానికి అక్రిడిటేషన్ కలిగివున్న జర్నలిస్టులకు మాత్రమే ఎన్నికల కమిషన్ జిల్లా రిటర్నింగ్ అధికారుల ద్వారా ఎలక్షన్ పాసులు పోలీంగ్ బూత్ లు, ఇతర ఎన్నికల ప్రక్రియను కవర్ చేయడానికి జారీ చేస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు డిసెంబరు 2020తోనే ముగిసి పోయింది. దీనితో కొత్త అక్రిడిటేషన్లు ఇస్తే తప్పా వారికి ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయడానికి వీలులేదు. అలాగని సమాచారశాఖ ప్రస్తుతం వున్న అక్రిడిటేషన్లను సైతం కొన్ని నెలలు రెవిన్యువల్ కూడా చేయలేదు. ఈ క్రమంలో కాలం చెల్లిన అక్రిడిటేషన్లకు ఎలక్షన్ కమిషన్ పాసులు ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డొస్తాయి. దీనితో ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని సమాచారశాఖ చేసిన ఈ పనికి మరోసారి లిఖిత పూర్వకంగా ప్రశ్రించే అవకావాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చైర్మన్ నిమ్మగడ్డ ద్రుష్టికి, అక్రడిటేషన్లు ఉంటే తప్పా ఎలక్షన్ కమిషన్ పాసులు వచ్చే పరిస్థితి రాదనే విషయాన్ని కొందరు సీనియర్ జర్నలిస్టులు తీసుకెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి దేశరాజధాని న్యూఢిల్లీలోని పీఐబీలో కూడా లేని నిబంధనలు పెట్టి, ఆ విధంగా మీడియా సంస్థలు అనుబంధ పత్రాలు, జిఎస్టీ, క్లిప్పింగులు, ఇతర ఆర్ఎన్ఐ అనుబంధ పత్రాలు ఆన్ లైన్ అప్ లోడ్ చేస్తే తప్పా అక్రిడిటేషన్లు ఇచ్చేది లేదంటూ బీష్మించుకొని కూర్చుంది సమాచారశాఖ. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలు జరపాలని, దానికి సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. ఈ తరుణంలో జర్నలిస్టులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి వెళ్లాలంటే ప్రభుత్వ గుర్తింపు(అక్రిడిటేషన్ కార్డు) అడ్డంకిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం సమాచార శాఖ ద్వారా ఇచ్చిన అరకొర సమాచారాన్ని మాత్రమే మీడియా సంస్థలు, జర్నలిస్టులు వార్తల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి వస్తుంది. అదీకూడా సమాచార అధికారులు తమకు నచ్చిన మీడియా సంస్థలకే ఆ సమాచారం కూడా పంపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ఇతర సంస్థల్లోకి వెళ్లడానికి ఖచ్చితంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఉండాలి. కానీ అక్రిడిటేషన్ల గడువు గత ఏడాది డిసెంబరుతో ముగిసినా, కనీసం అక్రిడిటేషన్లు గడువు పెంచకుండా సమాచారశాఖ కొత్త అక్రిడిటేషన్లు ఇచ్చేస్తామంటూ...నిబంధనల పేరుతో ఇప్పటి వరకూ కాలయాపన చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కొన్ని జర్నలిస్టు సంఘాలు ఈ విషయాన్ని కోర్టులో కేసువేయడంతో హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. అవే ఇపుడు కొనసాగుతున్నాయి. ఆ దెబ్బతో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు రాకుండాపోయాయి. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర,జిల్లా, మండల స్థాయి జర్నలిస్టులు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారిక కధనాలు, వార్తలు రాయడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. కాలం చెల్లిన అక్రిడిటేషన్లతో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులను జర్నలిస్టులు కలవలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ చర్యలపై గుర్రుగా వున్న ఎలక్షన్ కమిషన్, ఇపుడు కావాలనే పంచాయతీ ఎన్నికల్లో జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు రాకుండా చేయడానికే సమాచారశాఖ ఈ విధంగా వ్యవహరించదనే విషయాన్ని ఒక వర్గం మీడియా విషయాన్ని కమిషన్ ద్రుష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలా కాకుండా కాలం చెల్లిన అక్రిడిటేషన్ల జాబితా ఆధారంగా ఎన్నికల కమిషన్ పాసులు జారీచేస్తే అదీ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలలోకి తొక్కినట్టే అవుతుంది. అలా చేసినా ఎన్నికల కమిషన్ ను రాష్ట్రప్రభుత్వంలోని సమాచారశాఖ తప్పు పట్టినట్టుగానే కమిషన్ చూస్తుంది. ఇదంతా చూస్తుంటే ఎన్నికల సమయంలో జర్నలిస్టులు యాక్టివ్ గా పనిచేయడానికి వీలు లేకుండా ఉండేందుకే అక్రిడిటేషన్లు ఇవ్వకుండా, సమాచారశాఖ నిబంధనలు పెట్టిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు పచ్చగడ్డివేస్తే బగ్గుమని మండిపోతున్న సమయంలో సమాచారశాఖ అక్రిడిటేషన్ల విషయంలో కావాలని, నిబంధనలు అమలు చేయాలని చేసిన తాత్సారం ప్రభుత్వం పరువుని మరోసారి ఎన్నికల సంఘం ముందు తీసేలా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఎంత జనరంజక పాలన ప్రజలకు అందించాలని చూస్తున్నా ఏదోఒక ప్రభుత్వ శాఖ వలన ప్రభుత్వానికి తలనొప్పులు వస్తూనే వున్నాయి. ఈ మధ్య కాలంలో అత్యధికంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తలనొప్పి అధికమైంది. మరోసారి ఎన్నికల కమిషన్ జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలంటే అక్రిడిటేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. కాదు కూడదు జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు ఇవ్వకూడదని సమాచారశాఖ నిర్ణయించుకుంటే ఎన్నికల సంఘాలన్ని, సంఘం జర్నలిస్టులకు ఇచ్చే ఎలక్షన్ కమిషన్ పాసులను అపహాస్యం చేసినట్టే అవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వ మీడియా సలహాదారులు, సమాచారశాఖ అధికారులు జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే ఎలక్షన్ కమిషన్ పాసుల విషయం ఎన్నికల సంఘం, జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంతో కలిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాచారశాఖ పుణ్యమాని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి కమిషన్ నుంచి మాటపడే పరిస్థితులు తప్పేటట్టు లేవు. జర్నలిస్టులకు నిబంధనల పేరుతో అక్రిడిటేషన్లు ఇవ్వకుండా చేయాలని సమాచారశాఖ చూస్తుంటే.. అధికారుల చర్యలు, జీఓలతో ప్రభుత్వానికి చెరుపుకోలేని మచ్చలు ఏర్పడుతున్నాయి. అందులోనూ ఎలక్షన్ కమిషన్ విషయంలో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం కేంద్రం నిశితంగా గమనిస్తుంది. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ పాసులు అక్రిడిటేషన్ జర్నలిస్టులకు రాకుండా చేయడానికే ఉద్దేశ్యపూర్వం చేసిందని తేలితే దేశస్థాయిలో ప్రభుత్వ పరువు సమాచారశాఖ కావాలనే తీసినట్టు అవుతుంది. ఈ తరుణంలో సమాచారశాఖ అధికారులు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తారా? పాతవాటినే రెవిన్యువల్ చేస్తారా? అక్రిడిటేషన్లు లేకుండానే ఎలక్షన్ కమిషన్ పాసులు కాలం చెల్లిన అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇస్తారా? జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి మరోసారి తలవొంపులు తీసుకు వస్తారనే అనేది వేచి చూడాలి..!