జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-4
Ens Balu
15
Visakhapatnam
2021-01-30 09:44:48
జర్నలిస్టుగా మీడియాలో రాణించాలంటే ముందుగా జర్నలిజానికి సంబంధించిన చదువు ప్రతీఒక్క ఆశావాహుడూ చదవాల్సి వుంటుంది. చాలా మంది డిగ్రీ చదివిన తరువాత పీజీలో జర్నలిజం చేస్తారు. మరికొంత మంది జర్నలిజం డిప్లమా కోర్సులు చదవుతారు. మరికొంత మంది ఆయా మీడియా సంస్థలు నిర్వహించే జర్నలిజం కళాశాలలు, పాఠశాలల్లో శిక్షణ పొందుతారు. వీటన్నింటిలో ఒక పరిపూర్ణ జర్నలిస్టుగా మారాలంటే మాత్రం ముందు డిగ్రీ చదువుతున్న సమయంలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషల్లో పట్టు సంపాదించుకోవాలి. ఆపై జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చదవాల్సి వుంటుంది. అదే విధంగా కంప్యూటర్ వినియోగం, ఇంటర్నెట్ పైకా పట్టు సాధించాలి. అంతే తప్పా ఏ ఇతర జర్నలిజం సర్టిఫికేట్ కోర్సులు, పీజీ డిప్లమోలు జర్నలిస్టుగా మారడానికి ఎలాంటి ప్రభావం చూపించవు. అవన్నీ మేమూ జర్నలిజం కోర్సులు చేశామని చెప్పుకోవడానికి తప్పా మరెందుకూ పనిచేయవనే విషయాన్ని జర్నలిస్టులుగా మారే అభ్యర్ధులు గుర్తించాల్సి వుంటుంది. చాలా మందికి ఒక అనుమానం రావొచ్చు తెలుగులో జర్నలిస్టుగా పనిచేయడానికి తెలుగు వస్తే సరిపోతుంది కదా ఇంగ్లీషు, హిందీ ఎందుకు రావాలి? అని? అలా అనుకుంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, కేంద్రప్రభుత్వ సంస్థల్లోని అధికారులు ఎవరూ తెలుగులో మాట్లాడరు. అలాంటి సమయంలో తెలుగు వచ్చిన జర్నలిస్టులు వారు చెప్పే విషయాలను తెలుసుకోవడానికి వారి ముందు తెల్లమొహం వేయాల్సి వస్తుంది. అదే ముందుగానే మనకి ఇంగ్లీషు, హిందీ బాషల్లో ప్రావీణ్యం వుంటే ఏ అధికారి ఏ విధంగా మాట్లాడినా ఆ విషయాన్ని మనం సేకరించి ఒక న్యూస్ గా రాయడానికి వీలుపడుతుంది. దానికోసమే జర్నలిస్టుకి ఖచ్చితంగా ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష రావాల్సి వుంటుంది. ఒక్కోసారి ఇంగ్లీషు మీడియా, హిందీ మీడియాలో పనిచేయాలంటే మనం చదువుకున్న తెలుగు ఏ మాత్రం పనిచేయదు. అంతేకాదు జాతీయ మీడియాల్లో ఉద్యోగాలు కూడా రావు. దానికోసం జర్నలిస్టుగా మారాలనుకునే ఎవరైనా డిగ్రీ చదువుకునే సమయంలో మూడు బాషల్లో చదవడం, రాయడం, మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఆ తరువాత మనకున్న అవకాశాన్ని బట్టి పీజీలోని జర్నలిజం చదువుకున్న తరువాతగానీ, లేదంటే డిగ్రీ తరువాత ఆయా మీడియా సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా గానీ ఎంపికై జర్నలిజం శిక్షణ తీసుకుంటే జర్నలిస్టుగా రాణించడానికి మంచి అవకాశం వుంటుంది. ఏరంగంలోనైనా శిక్షణ లేకపోతే రాణించడం కష్టమనేది ఎంత నిజమో జర్నలిజంలో మాత్రం ఎలాంటి అవగాహన, శిక్షణ లేకపోతే మాత్రం మనం ఏమీ చేయలేమనే విషయాన్ని కూడా జర్నలిస్టు కావాలనుకునేవారు ముందుగా గుర్తించాల్సి వుంటుంది. అయితే ప్రాధమిక చదువుగా డిగ్రీ వుంటే, ఆ పై పీజి జర్నలిజం వుంటే సరిపోతుందా అనుకుంటే వాటితోపాటు కంప్యూటర్ పై పనిచేసే నైపుణ్యం కూడా రావాలి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషల్లో టైపింగ్ రావడంతోపాటు, ఫోటోషాప్, ఇంటర్నెట్ తదితర అంశాలపై అవగాహన ఉండాలి. మనకు తెలియని సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించి న్యూస్ రాయడానికి కంప్యూటర్ విద్యపైనా, వాడకంపైనా మంచి అవగాహన పెంచుకోవాలి, పనిచేయడం రావాలి. ముఖ్యంగా కంప్యూటర్ పై పనిచేయడం వచ్చిన వారికి మీడియా రంగంలో జర్నలిస్టుగా చేరడానికి మార్గం సుగమం అవుతుందనే విషయాన్ని ఆశావాహులు గుర్తించాల్సి వుంటుంది. జర్నలిస్టుగా మారాలనుకుంటే ప్రాధమికంగా డిగ్రీ, జర్నలిజంలో పీజీ, కంప్యూటర్ వినియోగం అవగాహన ఉంటే జర్నలిస్టుగా మారడానికి అవకాశం వుంటుంది. మీకు ఇప్పటికే ఒక అనుమానం రావాలి. ఏమీ చదువుకోలేని వారు సైతం జర్నలిస్టుగా పెన్నూ, పుస్తకం పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, మంచి పత్రికల్లో జర్నలిస్టులుగా చేస్తున్నారు కదా అని? నిజమే వారిని కూడా జర్నలిస్టులే అంటారు. కానీ శిక్షణ పొందిన జర్నలిస్టుకి, ఏమీ రాకుండా ఏ పత్రికలో జర్నలిస్టుగా మారిన వ్యక్తులకి నక్కకీ నాగలోకానికి ఉన్నంత భారా తేడా వుంటుంది. ఇలాంటి వారు ఏదైనా కలెక్టర్ గానీ, మరెవరైనా కేంద్ర ప్రభుత్వ అధికారి ప్రెస్ మీట్ కి వెళితే అక్కడ వీరి పనితనం ఏంటో మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. ప్రెస్ మీట్ లో అధికారి మాట్లాడుతుంటే ఎలాంటి చదువు, అవగాహన, శిక్షణ లేని జర్నలిస్టులు మీలా శిక్షణ పొందిన వారు రాస్తున్న పుస్తకం వైపు చూస్తారు. ప్రెస్ మీట్ మొత్తం పూర్తయిన తరువాత, సార్ ఒక్కసారి ఆయన ఇంగ్లీషులో ఏం చెప్పాడో మాకు తెలుగులో రెండు ముక్కలు చెప్పండి అంటూ అడుక్కుంటారు.. ఒక జర్నలిస్టు అంటే తోటి జర్నలిస్టుతో పాటు కార్యక్రమానికి వెళ్లి అన్నీ వచ్చిన జర్నలిస్టుని అడుక్కోవడమా..? అంటే శిక్షణ పొందిన జర్నలిస్టులు కాదని చెబుతారు. ఎందుకంటే వారు ముందుగానే డిగ్రీ చదివి వుంటారు. వారికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషలపై మంచి పట్టు వుంటుంది. ఏ కార్యక్రమంలో నైనా ఏ అధికారి ఏ బాషలో మాట్లాడినా వారు అర్ధం చేసుకో గలగుతారు. అంతేకాదు ఆయన చెప్పింది చెప్పినట్టుగా న్యూస్ ఫార్మాట్ లో వార్తలు కూడా రాయగలుగుతారు. కానీ మీకు వచ్చిన డౌట్ పరంగా చూస్తే...ఏమీ రాకుండా, కనీసం అధికారులు, అక్కడ మాట్లాడే ఇంగ్లీషు, హిందీ బాషలపై ఎలాంటి అవగాహన లేకపోతే అక్కడ వారు పడే నరకం ఏ స్థాయిలో వుంటుందో ఏమీ తెలియకుండా మేమూ జర్నలిస్టులమంటూ వచ్చేవారిని ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు. అంతేకాదు ప్రెస్ మీట్ పూర్తయిన తరువాత ఇంగ్లీషు మీడియా వారిని, ఇతర జాతీయ మీడియా వారిని అక్కడ జరిగిన అంశాలకు సంబంధించి కొన్ని విషయాలు అడుక్కోవడమే ప్రధాన అంశంగా కనిపిస్తుంది.. జర్నలిస్టుగా పనిచేసే సమయంలో దానంత చండాలం మరొకటి వుండదు. అలాంటి పరువు తక్కువ జర్నలిజం చేస్తే ఏంటీ చేయకపోతే ఏంటి అనే ప్రశ్న కూడా మిమ్మల్ని వేధిస్తుంటుంది. అందుకోసమే ఒక జర్నలిస్టుగా మారాలంటే చదువు, జర్నలిజంలో శిక్షణ చాలా ముఖ్యమనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. కానీ ఇపుడు మీడియా సంస్థలు కూడా చాలా కమర్షియల్ గా తయారు అయ్యాయి. ఏమీ తెలియకపోయినా వారి మీడియా సంస్థల్లో ఎవరిని పడితే వారిని జర్నలిస్టులుగా చేర్చుకుంటున్నాయి. అదే సమయంలో జాతీయ మీడియా సంస్థలు ఇప్పటికీ కూడా మంచి విద్య, బాష పట్టు, జర్నలిజంలో శిక్షణ పొందిన వారిని మాత్రమే నేటికీ జర్నలిస్టులుగా తీసుకుంటాయి. మంచి జీత భత్యాలు కూడా ఇస్తున్నాయి. దానికోసం జర్నలిస్టుగా మారాలంటే మాత్రం కనీసం డిగ్రీ చదువుతోపాటు మంచి జర్నలిజం శిక్షణ కూడా చాలా అవసరం. మీడియా అంటే ఇక్కడ జర్నలిస్టు మాత్రమే కాదు. ఫోటోగ్రాఫర్ లేదా ఫోటో జర్నలిస్టు, సబ్ ఎడిటర్, పేజ్ డిజైనర్, ప్రింటింగ్, ఫోటో డిజైనర్ లేదా ఫోటో ఎడిటర్ విభాగాల్లోకి వెళ్లాలంటే మాత్రం పైన పేర్కొన్న అంశాలతోపాటు, మరికొన్ని నేర్చుకోవాల్సి వుంటుంది. అవి ఎక్కడ నేర్చుకోవాలి? ఏ శిక్షణా సంస్థలు వాటిని నేర్పుతాయి? జర్నలిస్టుగా కాకుండా ఈ విభాగాల్లో జీతాలు ఎక్కువగా వుంటాయా? ఇంకా ఏం నేర్చుకుంటే, ఎందులో ప్రావీణ్యం సంపాదిస్తే ఏ విభాగంలో ఉద్యోగాలు వస్తాయి? అనే విషయాన్ని రేపటి పాఠంలో చర్చిద్ధాం..!