జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-4
Ens Balu
3
Visakhapatnam
2021-02-01 12:39:59
మీడియా రంగంలో మంచి జర్నలిస్టుగా ఎదగాలంటే ముందుగా డిగ్రీ చదువు తప్పని సరిగా ఉండాలి. ఆపై జర్నలిజంలో పోస్టు గ్రాడ్యూషన్ చేస్తేనే ప్రధాన మీడియా సంస్థలు జర్నలిస్టులుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అయితే జర్నలిస్టుగా సుస్థిర స్థానాన్ని కల్పించుకోవాలంటే ముందుగా జర్నలిస్టుకి కంప్యూటర్ వినియోగంపై అవగాహన, తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషల్లో ముందుగా టైపింగ్ రావాల్సి వుంటుంది. దానికోసం డిగ్రీ తరువాత గానీ, పీజీ చదివే సమయంలో గానీ శిక్షణ తీసుకుంటే మంచి ఉపయోగం. అదే సమయంలో డిటిపి(డెస్క్ టాప్ పబ్లిషింగ్) లోనూ శిక్షణ పొందాల్సివుంటుంది. ముఖ్యంగా పత్రిక, టివీ రంగాల్లో జర్నలిస్టుగా ఉద్యోగం సంపాదించాలనుకుంటే మూడు భాషల్లో ఏ భాష మీడియాలోకి వెళ్లాలని ముందుగా అనుకుంటామో దానికి సంబంధించి టైపింగ్ లో శిక్షణ పొందాలి. జర్నలిజంలో పీజీ పూర్తి అయ్యేనాటికి పత్రికా రంగంలో ఉన్న పోస్టుల్లో ఫోటోజర్నలిస్టు, సబ్ ఎడిటర్, పేజి డైజనర్, గ్రాఫిక్ డిజైనర్ ఇలా ఉండే విభాగాల్లో చేరాలనుకుంటే మళ్లీ వివిధ
అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందాలి. ఉదాహరణకు ఫోటో జర్నలిస్టుగా చేరాలనుకుంటే ఖచ్చితంగా డిప్లమా ఇన్ ఫోటో గ్రఫీ గానీ, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ ఫోటో గ్రఫీ గానీ చేయాల్సి వుంటుంది. అదే వీడియో జర్నలిస్టుగా మారాలనుకుంటే అదే కోర్సులో వీడియోగ్రఫీ కోర్సు చేసి వీడియో కెమెరాను వినియోగించడంలో శిక్షణ పొందాలి. అదే సబ్ ఎడిటర్ గా ఉద్యోగం పొందాలనుకుంటే డిటిపి లో శిక్షణ తీసుకోవాలి. ముఖ్యంగా పేజ్ మేకర్, క్వార్క్ ఎక్స్ ప్రెస్, ఫోటోషాప్ లలో ప్రావీణ్యం సంపాదించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మనం పనిచేసే ప్రాంతీయ భాషపై పట్టు సంపాదించాలి. అంటే తప్పులు లేకుండా భాషను వినియోగించాల్సి వుంటుంది. పాఠకుడి అభిరుచికి అనుగుణంగా శీర్షికలు పెట్టాలన్నా, సబ్ హెడ్డింగ్స్ మంచిగా పెట్టాలన్నా భాషపై పట్టు చాలా ముఖ్యం. అదే సమయంలో వార్తలతోపాటు ఫోటోలు కూడా డిజైన్ చేయడానికి అదనంగా ఫోటోషాప్ వచ్చి వుండాలి. ఇక పేజి డిజనర్ గా మీడియా రంగంలో కెరీర్ మొదలు పెట్టాలనుకున్నవారు క్వార్క్ ఎక్స్ ప్రెస్, ఫోటోషాప్, పేజ్ మేకర్ కోర్సులు నేర్చుకోవాలి. వాటితో పాటు ఫోటోషాప్ కూడా పూర్తిస్థాయిలో నేర్చుకోవాలి. ఈ ఉద్యోగంలో సబ్ ఎడిటర్లు ఇచ్చిన వార్తలను పేజ్ డిజైనర్ అందంగా పేజిలో డిజైన్ చేయాల్సి వుంటుంది. కలర్ కాంబినేసన్ తెలియడం కోసం ఖచ్చితంగా డిటిపీ కోర్సు నేర్చుకోవాల్సి వుంటుంది. జర్నలిజంలో శిక్షణ కూడా తీసుకొని వుంటే ఒక్కోసారి సబ్ ఎడిటర్ పెట్టిన శీర్షికలు బాగాలేకపోయినా సొంతంగా శీర్షికలు పెట్టడానికిగానీ, మార్పులు చేర్పులు చేయడానికి గాని అవకాశం వుంటుంది. ఇకపోతే గ్రాఫిక్ డిజైనర్ గా మీడియాలో కెరీర్ ప్రారంభించాలంటే దానికోసం డిప్లమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ కోర్సులు నేర్చుకోవాల్సి వుంటుంది. పోటోలకి బ్యాక్ గ్రౌండ్, హెడ్డింగ్స్, ఫోటో ఎడిటింగ్, ఫోటోను వార్తలకు అనుగుణంగా అందంగా తీర్చిదిద్దడానికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అదే ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదే గ్రాఫిక్ డిజైన్ పోస్టుకి చాలా డిమాండ్ వుంటుంది. ఏ వార్త బ్రాడ్ కాస్ట్(టివిలో ప్రసారమవడం) కావాలన్నా ఖచ్చితంగా ఒక్కో వార్తకు, లేదంటే మంచి స్టోరీలకు కనీసం నాలుగైదు గ్రాఫిక్ ప్లేట్స్ అవసరం అవుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిబేట్లు, ప్రత్యేక కధనాలు బ్రాడ్ కాస్ట్ చేసే సమయంలో గ్రాఫిక్ డిజనర్ పాత్ర చాలా కీలకంగా వుంటుంది. అదే విధంగా వీడియో ఎడిటర్ కావాలనుకుంటే దానికి ప్రత్యేకంగా వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, టుడీ, త్రీడి యానిమేషన్ తదితర కోర్సులన్నీ నేర్చుకోవాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే వీడియో ఎడిటర్ పాత్ర చాలా ప్రాముఖంగా వుంటుంది. న్యూస్ రీడర్ చదివే వార్తలకు అనుగుణంగా విజువల్స్ ప్లే అవుతూ, ప్లే బ్యాక్ లో వాయిస్ రావాలంటే దానికి ప్రధాన భూమిక వీడియో ఎడిటర్ పోషించాల్సి వుంటుంది. ఇన్ని నేర్చుకుంటే తప్పా మీడియా సంస్థలో జర్నలిస్టుగా గానీ, సబ్ ఎడిటర్ గానీ, వీడియో ఎడిటర్ గా గానీ, గ్రాఫిక్ డిజైనర్, పేజ్ డిజైనర్, వీడియో జర్నలిస్టుగా ఉద్యోగ అవకాశాలు రావు. ఇన్ని విషయాలపై మీకు అవగాహన వచ్చిన తరువాత మీడియా రంగంలో జర్నలిస్టుగా గానీ కార్యాలయంలో డెస్కు జర్నలిస్టుగా గానీ కెరీర్ ప్రారంభించాలనుకుంటే ఎంత కష్టమనేది దీనిని బట్టి మీకు అర్ధమై వుండాలి. ఎలాంటి చదువు, శిక్షణ, లేకుండానే మేమూ జర్నలిస్టులమే అని చెప్పుకొని తిరిగేవారికి, అన్నివిషయాల్లో శిక్షణలు పొంది ప్రావీణ్యం సంపాదించిన వారికి ఎంత తేడా వుంటుంటో ఒక్కసారి గమనించుకోవాల్సి వుంటుంది. పైన పేర్కొన్నట్టుగా డిగ్రీ, ఆపై పోస్టు గ్రాడ్యూషన్ లో జర్నలిజం, ప్రాంతీయ భాషలో టైపింగింగ్ కంప్యూటర్ వినియోగం వచ్చేస్తే జర్నలిస్టు అయిపోవచ్చా అంటే అయిపోవచ్చు. కానీ మంచి జర్నలిస్టుగా మారాలంటే మాత్రం దానికి ఎంతో నిరంతర పరిశ్రమ, పాఠకుడికి చేత వార్తను ఖచ్చితంగా చదివేలా చేయడం, సినియారిటీ చాలా అవసరం అవన్నీ ఎలా వస్తాయి? ఏవిధంగా పనిచేస్తే వస్తాయి? జర్నలిజం చదివే సమయంలో దానికి తగ్గట్టు మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలాంటి సూచనలు పాటించాలి? ఏ ఏ విషయాలను ప్రామాణికంగా తీసుకోవాలి? ఏ రకంగా పనిచేస్తే మంచి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోవచ్చు అనే విషయాలు రేపటి పాఠంలో చర్చిద్దాం. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!