500 ఆలయాలకు టిటిడి శ్రీకారం..
Ens Balu
4
Tirumala
2021-02-03 22:29:35
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో విడతలో 500 ఆలయాల నిర్మాణానికి సమరసత సేవా ఫౌండేషన్, సంస్కృతి సంవర్ధిని సంస్థల ద్వారా శ్రీకారం చుట్టాలని టిటిడి నిర్ణయించింది. ఆయా సంస్థల ప్రతినిధులు, హెచ్‌డిపిపి అధికారులతో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తిరుపతి పరిపాలనా భవనంలోని తమ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎపిలో సమరసత సేవా ఫౌండేషన్ కార్యక్రమాలు చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. ఆ సంస్థ నిర్వహిస్తున్న బాలవికాస కేంద్రాలకు ఆధ్యాత్మిక, దేశభక్తిని పెంపొందించే పుస్తకాలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. మారుమూల గ్రామాల్లోని ఎస్సి, ఎస్టీ మత్స్యకార కాలనీల్లో అర్చక వృత్తిపై ఆధారపడ్డవారికి షోడశ సంస్కారాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని హెచ్‌డిపిపి అధికారులను ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకే టిటిడి నిర్మించిన 500 ఆలయాల్లో కల్యాణోత్సవం ప్రాజెక్టు ద్వారా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలన్నారు. ఈ ఆలయాల కోసం టిటిడి ఇప్పటికే కొనుగోలుచేసిన మైక్‌సెట్లు, గొడుగులు, భజన సామగ్రి, పెన్‌డ్రైవ్‌ల ద్వారా అన్నమయ్య సంకీర్తనలు అందించాలని ఆదేశించారు.
ఎపిలో సమరసత సేవా ఫౌండేషన్, తెలంగాణలో సంస్కృతి సంవర్ధిని సంస్థల ద్వారా 500 ఆలయాల నిర్మాణానికి అనుమతి కోసం రాబోయే హెచ్‌డిపిపి కార్యవర్గ సమావేశానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఈవో చెప్పారు. నూతనంగా నిర్మించే ఒక్కో ఆలయానికి టిటిడి రూ.10 లక్షల వరకు సమకూర్చనుందని ఈవో వెల్లడించారు. ఆలయాల నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేసే బాధ్యతను ఆ రెండు సంస్థలకు అప్పగించారు. గ్రామ గ్రామాన హిందూ ధర్మ విస్తృత ప్రచారం కోసం టిటిడి ధర్మరథాలు సిద్ధం చేస్తోందన్నారు. ఇవి రాగానే ఇప్పటికే నిర్మించిన 500 ఆలయాలకు వెళ్లేలా రూట్‌మ్యాప్ తయారు చేయాలన్నారు. ఆయా గ్రామాల్లోని శ్రీవారి భక్తులకు తిరుమలలో శ్రీవారిసేవ చేసే అవకాశం కల్పిస్తామని ఈవో చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న టిటిడి కల్యాణమండపాలను ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఎఫ్ఏ అండ్ సిఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, సమరసత ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్, సంస్కృతి సంవర్ధిని ప్రతినిధి అమరలింగన్న పాల్గొన్నారు.