రాష్ట్రంలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
2
Vijayawada
2021-02-08 20:19:20
రాష్ట్రంలో పంచాయతీ మొదటిదశ పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ మరియు రూరల్ డవలప్‌మెంట్ కమీషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ మొదటి దశ ఎన్నికలకు సంబంధించి 3,249 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు గాను 525 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 32,502 వార్డు మెంబర్లకు గాను 12,185 వార్డు స్దానాలు ఏకగ్రీవం అయ్యాయని ద్వివేది వివరించారు. ఇంకనూ మిగిలిన 2,723 సర్పంచ్ స్ధానాలకు 20,157 వార్డు మెంబర్ల స్థానాలకు 43,601 మంది అభ్యర్దులు పోటీలో ఉన్నారన్నారు. ఈనెల 9న పోలింగ్ జరుగుతుందని నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తిచేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంగళవారం నిర్వహించే మొదటి దశ పోలింగ్ 12 జిల్లాలో జరుగుతుందని, విజయనగరం జిల్లాలో మొదటి దశ పోలింగ్ లేదని ఆయన వివరించారు. ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి 29,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అందులో 3,458 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లకుగాను, 3,594 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి పటిష్టమైన శాంతి భద్రతలు నిర్వహణకు అవసరమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
పోలింగ్ సిబ్బంది సోమవారం సాయంత్రానికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని ఆయన అన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధి స్టేజ్ -1 రిటర్నింగ్ ఆఫీసర్లుగా 1,130 మంది, స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లుగా 3,249 మందిని, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా 1,432 మందిని, ప్రెసైడింగ్ ఆఫీసర్లుగా 33,533 మందిని ఇతర పోలింగ్ సిబ్బందిగా 44,392 మందిని మొదటి దశ పోలింగ్ నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి జోనల్ అధికారులుగా 519 మందిని, రూట్ అధికారులుగా 1,121 మందిని, పోలింగ్ సరళిని పర్యవేక్షించుటకు మైక్రో అబ్జర్వర్లుగా 3,047 మందిని నియమించి వీరందరికి సమర్దవంతంగా ఎన్నికలు నిర్వహించుటకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. మొదటి దశ పోలింగ్ లో 16,688 పెద్ద బ్యాలెట్ బాక్స్‌లు, 8,503 మీడియం బ్యాలెట్ బ్యాక్స్‌లు, 21,338 చిన్న బ్యాలెట్ బాక్స్‌లు ఈ పోలింగ్ లో వినియోగిస్తున్నామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. పోలింగ్ సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయుటకు 215 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైన పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిద్దంగా ఉంచి సోమవారం సాయంత్రానికి
పోలింగ్ మెటీరియల్‌తో పాటు ఆయా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొనేలా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. 5 కి.మీల కన్నా ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ సిబ్బందిని, సామాగ్రిని తరలించుటకు 2,216 పెద్ద వాహనాలను, 5 కి.మీ ల కన్నా తక్కువ ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1,412 చిన్న వాహనాలను పోలింగ్ సిబ్బందిని, సామాగ్రి తరలించుటకు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొదటి సారిగా “నోటా”ను తీసుకువచ్చామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి, మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజులు అన్ని పోలింగ్ కేంద్రాల్లోను సిద్దంగా ఉంచామని ఆయన అన్నారు. చివరి గంట పిపిఇ కిట్లతో కోవిడ్ బాధితులు ఓటు వినియోగించుకోవచ్చుః- కోవిడ్ పాజిటివ్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారికి పిపి ఇ కిట్లను ఏర్పాటు చేశామని వారు పోలింగ్ చివరి గంటలో వారి ఓటు హక్కును వినియోగించు కోవచ్చని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. పోలింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం తగు రక్షణ కల్పించామని, మహిళా పోలింగ్ సిబ్బందికి తగిన వసతులు ఏర్పాటు చేశామని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, పోలింగ్ స్టేషన్ల వద్ద పోలింగ్ సిబ్బందికి అవసరమైన అల్పాహార, భోజన వసతిని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. మొదటిదశ పోలింగ్ సందర్భంగా అదేరోజు కౌంటింగ్ నిర్వహణకు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, కోవిడ్ రక్షణకు చర్యలు తీసుకున్నామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.
మొదటి దశ కౌంటింగ్ కు సంబంధించి 14,535 సూపర్ వైజర్లను, 37,750 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చామని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇందుకుగాను రాష్ట్ర స్దాయిలో 13 మంది అధికారులతో కమీషనర్, పంచాయతీరాజ్ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంట.ర్ ఏర్పాటు చేశామని, అన్ని జిల్లాలోను ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నవని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంగళవారం జరగనున్న మొదటి దశ పోలింగ్ గ్రామ పంచాయతీలోని ఓటర్లు ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్య స్పూర్తితో ఈఎన్నికల్లో పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమీషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.