హరినామస్మరణే మోక్షానికి మార్గం..
Ens Balu
4
Tirumala
2021-02-10 21:01:57
కలియుగంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదని, హరినామస్మరణ చేస్తే చాలని కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు బుధవారం తిరుమలలోని ఆస్థానమండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుంచి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. శ్రీ పురందరదాసులవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతిసారి సహస్ర దళ సంకీర్తన రత్నాలతో స్వామివారి పాదపద్మాలను సేవించినట్లు తెలిపారు. శ్రీగిరి పర్వతానికి అధిపతి అయిన శ్రీనివాసుడిని ఉదయం ఏళు నారాయణ....ఏళు లక్ష్మీ రమణ ....అనే సంకీర్తనతో స్వామివారిని మేల్కొలిపే వారన్నారు. శ్రీవారి అనుగ్రహం కొరకు ఆకాశరాజు శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారికి సమర్పించినట్లు, మనము సంకీర్తనలు, మంత్ర, స్త్రోత్ర పారయణంతో శ్రీనివాసుడి అనుగ్రహం పొందవచ్చన్నారు. కావున సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో చెడు విషయాలపై దృష్టి పెట్టకుండా భగవన్నామస్మరణ చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు హైందవ సనాతనధర్మ ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని వివరించారు.
అంతకుముందు దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ''గురుపురందర దాసరే...., వండిదే పురందరదాసర....దేవ బంధ నమ్మ స్వామి బంధ....'' తదితర సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు. కోవిడ్ - 19 మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 300 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడ పురందరదాసుల సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తారు.