సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సర్పంచ్ అయ్యాడు..
Ens Balu
1
Krishnadevipeta
2021-02-16 12:10:12
ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి నెలకు లక్షల్లో జీతం..పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం..కారు బంగ్లా, మంచి హోదా,ఆస్తి అంతస్తు..కానీ ఇవేమీ అతగాడికి నచ్చలేదు. సుదీర్ఘ కాలం సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసి దేశ విదేశాలు తిరిగి తిరిగి ఆ కార్పోరేట్ ఉద్యోగాన్ని, జీతాలను ఏమీ కాకుండా వదిలేసి సేవచేయడానికి సొంత గ్రామానికి వచ్చేశాడు.. సర్పంచ్ బరిలో నిలబడి ముగ్గురు ప్రత్యర్ధులను మట్టికరిపించి మరీ సర్పంచ్ అయిపోయాడు ఆయన పేరే పందిరి సత్యన్నారాయణ, ఇతగాడిని అంతా చిన్ననాటి నుంచి సత్యంనాయుడు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈయన తండ్రి పందిరి అప్పారావు 30ఏళ్లు పాతూరుగా పిలబడే క్రిష్ణదేవీపేట గ్రామానికి సర్పంచ్ గా సేవలు అందించారు. పుట్టిన గ్రామానికి తనవంతు సహకారం అందించాలని, గ్రామాన్ని జిల్లాలోనే బెస్ట్ గ్రామంగా అభివ్రుద్ధి చేయాలని నిర్ణయించుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి ప్రజలు యువత మద్దతులో సర్పంచ్ అయిపోయాడీ యువకుడు. విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలను ఎదిరించి మన్యం పితూరీ నడిపిన పోరాటాల పురిటిగడ్డ)లో పంచాయతీ పోరులో అల్లూరి సాక్షిగా నిలబడి అందరినీ ఓడించి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా సర్పంచ్ సీటుకు కైవసం చేసుకున్నాడు. యువత, మహిళలు మొత్తం ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కే మద్దతు పలకడం ఈయన గెలుపునకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. గ్రామంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటికి ప్రత్యేక కార్యాచరణ కూడా తయారు చేసి ఒక క్రమబద్ధంగా గ్రామాన్ని అభివ్రుద్ధి చేయడాని పూనుకుని అదే విషయాన్ని ప్రజలకు చెప్పాడు.. అసలే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశాడేమో...గ్రామంలోని సమస్యలన్నింటినీ ఫోటోలు, వీడియోలతో సహా అన్ని ప్రాంతాలను కంప్యూటరీకరణ చేసిమరీ మొత్తం సిద్ధం చేసి అన్ని వార్డుల్లోనూ తిరుగుతూనే ప్రజలందరికీ వివరించాడు. గ్రామంలోని అన్ని వర్గాలకు అనుగుణంగా అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక ప్రోగ్రామ్ షీట్ నే తయారు చేసుకుని మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. ఇంట్లోనే రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు, జెరాక్సు మిషన్లు పెట్టి ప్రభుత్వ పథకాలకు స్థానికులు దరఖాస్తు చేసుకునే ప్రతీ కార్యక్రమానికి తనవంతుగా సహాయం చేయడం మొదలు పెట్టి ప్రజల మనసులను గెలుచుకున్నాడు. అన్ని దగ్గరుండి అన్ని పథకాలకు దరఖాస్తులు చేయిస్తూ గ్రామస్తులకు సహాయ పడుతూ వచ్చాడు. ఒక వేళ మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చినా తానే దగ్గరుండి మరీ వారిని తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో తనవంతుగా చేయూతనిచ్చేవాడు. దీనితో.. ప్రజల మనిషిగా గుర్తింపు పడటం, అదే సమయంలో తన తమ్ముడు పందిరి వెంకటరమణ(ఆర్ఎంపీ బుజ్జి) కూడా ప్రజలకు తనవంతుగా ప్రాధమిక వైద్యం అందించడం, ప్రజలకు చిన్న చిన్న సేవలు చేయడంతో గ్రామస్తులంతా ఏకమై మళ్లీ మరోసారి ఈ కుటుంబం నుంచే సత్యంనాయుడుని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. గ్రామంలో వాలంటీర్లు ఉన్నప్పటికీ వారికంటే ఎక్కువగా సేవలదించడంలో ముందుంటడంతో ముఖ్యంగా మహిళలకు, యువతకు బాగా చేరువయ్యాడు ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మరో విశేషం ఏంటంటే కరోనా సమయంలో గ్రామస్తులకు సేవ చేయడానికి ప్రాధమిక వైద్యం(ఫ్టస్ట్ ఎయిడ్ సర్వీస్) అందించడానికి విశేషంగా క్రుషిచేశారు.. గ్రామంలో ఎవరికి జర్వం వచ్చినా, దగ్గొచ్చినా తక్షణమే ప్రాధమిక వైద్యం చేస్తూ, ఎవ్వరికీ లేదు అనిపించుకోకుండా వైద్యసేవలు చేశారు. కరోనా సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లోకే జనాలను రానీయని సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, గ్రామంలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా సేవలదించింది ఈ కుటుంబం. పైగా ఆ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఒకసారి కూరగాయలు, మరోసారి మాస్కులు, ఇంకోసారి సబ్బులు పంపిణీ కూడా చేశారు. వీరి కుటుంబం మొత్తం ప్రజాసేవలోనే ఉంటూ గ్రామస్తుల నోట్లో నానుతూ రావడంతో ఈ కుటుంబం నుంచే మరోసారి సత్యంనాయుడు సర్పంచ్ కావడానికి అవకాశం వచ్చింది.. ఒక కుటుంబం మొత్తం ప్రజాసేవకు పూనుకోవడం విశాఖజిల్లాలోనే ఇపుడు హాట్ టాపిక్..అందులోనూ బరిలో నిలబడి కులరాజకీయం చేయాలని చూసినా.. వారందరినీ తోసిరాజని సర్పంచ్ సీటు కైవసం చేసుకున్నాడు సత్యంనాయుడు.. ఎంత చదువు చదువుకున్నా లక్షల జీతం కోసం అంతా అర్రులు చాస్తున్న ఈ రోజుల్లో అదే లక్షల రూపాయల జీతాలన్ని, మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని, గ్రామాభివ్రుద్ధికోసం పంచాయతీ సర్పంచ్ గా బరిలో నిలబడి గెలిచి తన పట్టుని నిరూపించుకున్నాడు. గెలవగానే గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అందరికి తెలియజేశాడు కూడా. సాఫ్ట్ వేర్ ఇంజనీర్..హార్డ్ వేర్ లాంటి రాజకీయంలో నెగ్గి ఆ విజయాన్ని తమ నియోజకవర్గ ఎమ్మెల్యేతో కూడా పంచుకోవడం కూడా ఇపుడు జిల్లాలోనూ, పార్టీలోనూ హాట్ టాపిక్ మారుతోంది. మంచి ఆలోచనతో, గ్రామాభివ్రుద్ధికి నడుంబిగించి సర్పంచ్ అయిన సాఫ్ట్ వేర్ఇంజనీర్ ని మనమూ అభినందిద్దాం..!