ఒక సర్పంచ్ మూడు కార్యాలయాలు..


Ens Balu
2
Tadepalle
2021-02-18 13:13:19

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థతో ఒక్కో సర్పంచ్ కి ఒక్కో చోట మూడు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.. ఏంటి చదవడానికి కాస్త వింతగానూ, ఆశ్చర్యంగానూ ఉంది కదూ..మీ ఆలోచన నిజమే. రాష్ట్రంలోని మేజర్ పంచాయతీల్లో ఒక్కో సర్పంచ్ కి మూడు కార్యాలయాలు వున్నాయి. అదేనండీ జనాభా ప్రాతిపధికన ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో వున్న సర్పంచ్ కి ఉన్న కార్యాలయాల సంఖ్య ఇది. గ్రామసచివాలయాలు ఏర్పాటు కాకముందు ఒక పంచాయతీ కార్యాలయంలోనే సర్పంచ్ ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేదు. గ్రామంలో ఎన్ని గ్రామసచివాలయాలు ఉంటే అన్నింటికీ సర్పంచ్ తిరగాలన్నమాట. ఒక్కో సచివాలయంలో రెండు రోజులు చొప్పున పంచాయతీ సర్పంచ్ విధులు నిర్వహించాల్సి వుంటుంది. ఒక్క సచివాలయం ఉన్నచోట మాత్రం వారానికి ఆరు రోజులు విధులు నిర్వహించాల్సి వుంటుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా దీనికి సంబంధించి అధికారులే ఇంకా సచివాలయాల పరిధిలోని రికార్డులను, పరిధిలను విభజన చేయలేదు. కొన్ని చోట్ల గ్రామసచివాలయాల భవనాలు నిర్మాణాల్లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్ర పూర్తయ్యాయి. పూర్తయిన చోట్ల మాత్రం కొత్త సర్పంచ్ లు మూడు సచివాలయాలకు వెళ్లాల్సిందే. అంటే ఏ ప్రాంత పరిధిలోని ప్రజలు ఆయా గ్రామసచివాలయాల పరిధిలో ఆ కార్యాలయంలోనే సర్పంచ్ ను కలవాల్సి వుంటుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అన్ని సచివాలయాలకు సిబ్బందిని నియమించింది.. కానీ, ప్రాంతాలను బట్టి ఇంకా సచివాలయాల రికార్డులు మాత్రం వేరు చేయలేదు. దీనిపై గత ఏడాది నుంచి రాద్దాంతం జరగుతున్నా కొందరు సీనియర్లు సచివాలయాల పరిధిలను విభజన చేయడానికి మాత్రం అంగీకరించడం లేదు. అలాగని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి కూడా కార్యదర్శిలకు, ఎంపీడీఓలకు ఆదేశాలు రాలేదు. అదంతా సర్పంచ్ లు రాకముందు. ఇపుడు ఖచ్చితంగా విభజన జరిగి తీరాలి. అలా విభజన జరగకపోతే సచివాలయ కార్యదర్శి నుంచి సర్పంచ్ ఇతర సిబ్బంది విధుల నిర్వహణకు కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం వుంది. రాష్ట్రంలోని మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసిన తరువాత ప్రభుత్వం కూడా సచివాలయాల వారీగా సిబ్బందిని, శానిటేషన్ పనివారిని, రికార్డులను విభజన చేయాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతుంది. ఎంత త్వరగా విభజన జరిగితే అంతే త్వరగా గ్రామాభివ్రుద్ధి, సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదంటే రోజుకో సచివాలయం పరిధిలో ఈ విభజనగొడవలను పరిష్కరించేందుకే సర్పంచ్ లకు సమయం మొత్తం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ లకు తొలి సమస్య గ్రామసచివాలయాల పరిధి విభజనే ప్రధానంగా..తొలి పంచాయతీ సమస్యగా కూడా నిలువనుంది..!