రథసప్తమికి భక్తిశ్రద్ధలతో సేవలందించాలి..
Ens Balu
2
Tirumala
2021-02-18 20:56:22
రథసప్తమినాడు శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి డెప్యుటేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తిశ్రద్ధలతో సేవలందించాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో డెప్యుటేషన్ సిబ్బందికి, శ్రీవారి సేవా సదన్-2లో శ్రీవారి సేవకులకు గురువారం అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఉద్యోగులు, శ్రీవారిసేవకులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని, భక్తులు కూడా ధరించేలా తెలియజేప్పాలని కోరారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులందరికీ తాగునీటి బాటిల్ అందిస్తామని, అది ఖాళీ అవగానే తిరిగి అక్కడే ఉన్న కొళాయిల్లోని జలప్రసాదం నీటిని నింపుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. గ్యాలరీల్లో చివర ఉన్న భక్తులకు కూడా తాగునీరు, అన్నపానియాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న మరుగుదొడ్ల గురించి భక్తులకు తెలియజేయాలన్నారు. శ్రీవారి సేవకుల సాయంతో చక్కగా భక్తులకు సేవలు అందించాలన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు వాహనసేవలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే అందుబాటులో ఉన్న అధికారులను వెంటనే సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో టిటిడి డెప్యూటీ ఈవో నాగరాజ, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, విజివో బాలిరెడ్డి, క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్.శాస్త్రి, శ్రీవారి సేవా సెల్ ఏఈవో రమాకాంతరావు, టిటిడి అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.