కొత్త పంచాయతీయతీలకు చెత్త స్వాగతం..
Ens Balu
2
Tadepalle
2021-02-19 09:15:58
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం తెచ్చామని ప్రకటించుకుంటున్న ప్రభుత్వానికి, కొత్త గ్రామ పంచాయతీ పాలక మండళ్లకు దుర్వాసనతో కూడిన చెత్త స్వాగతం పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల తరువాత ఏర్పడిన గ్రామ పంచాయతీలకు, వాటినే పేరు మార్చిన గ్రామసచివాలయాలకు అన్ని గ్రామాలు చెత్తతో నిండిపోవడమే దానికి కారణం. ఏంటి కొత్త పంచాయతీలకు చెత్త స్వాగతం చెప్పడమేంటని ఆలోచిస్తున్నారా అయితే మీరు కూడా చెత్తలో కాలుమోపినట్టే. రాష్ట్రంలోని సుమారు పదేవేల చిలుకు గ్రామ పంచాయతీలుంటే అందులోని మేజర్ పంచాయతీల్లో మాత్రమే శానిటేషన్ సిబ్బందిని నియమించుకొని, ట్రాక్టర్లు ద్వారా చెత్తను అరకొరగా తొలగిస్తున్నాయి. మిగిలిన చిన్న పంచాయతీలకు ఎలాంటి శానిటేషన్ సిబ్బంది లేరు. ఎవరైతే గ్రామంలో పనిచేసే తలయారీ వున్నాడో ఆయనే గ్రామం మొత్తం తిరిగి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించాల్సిన దుస్థితి ఏర్పండి. ఒక్క తలయారీ గ్రామంలోని చెత్తను మొత్తం ఎత్తాలంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి అర్ధం చేసుకుంటే...నెలలో ఒకసారి కూడా ఏ ఒక్క వీధికి కూడా చెత్తను తీసుకెళ్లడానికి ఆ తలయారీ వచ్చే పరిస్థితులు లేవు. ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో శానిటేషన్ సిబ్బందిని నియమించినట్టుగా చిన్న పంచాయతీలకు కూడా శానిటేషన్ సిబ్బందిని ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకు అధికారులూ, ప్రభుత్వం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా ఎలాంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండి పోతుంది. అయినప్పటికీ యధాప్రకారంగా ఇంటిపన్నులు, లేని గ్రంధాలయానికి ల్రైబ్రెరీ పన్నులు, వీధిలైట్ల పన్నులు, నీరు రాని మంచినీటి కుళాయిలకు కుళాయి పన్ను ఇలా ప్రజల నుంచి చాలా పన్నులే వసూలు చేస్తుంది. గతంలోనే సర్పంచ్ లు పంచాయతీల్లో శానిటేషన్ సిబ్బందిని నియమించే విషయమై మండల అధికారులను కోరితే...ప్రభుత్వం పరిశీలన చేస్తుందని కాలయాపన చేశారు. ఆ తరువాత టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలకు ఎన్నికలే నిర్వహించడం మానేసింది. దీనితో గ్రామంలోని చెత్త సమస్య అలానే ఉండిపోయింది. ఇపుడు కొత్తగా ఎన్నికైన చిన్న పంచాయతీలకు మాత్రం గ్రామాల్లోని చెత్తే వారికి దుర్వాసనతో స్వాగతం పలుకుతోంది. కారణం ఒక్కటే ఎక్కడి చెత్త అక్కడ దారుణంగా పేరుకుపోవడమే. చాలా పంచాయతీల్లో చెత్త ఎత్తని కారణంగా ఇంటి పన్నులు కూడా కట్టమని తెగేసి చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా చిన్నపంచాయతీల్లోని ప్రజలంతా చెత్తకోసం ఉద్యమించే పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం చిన్న పంచాయతీల్లో వున్న వారంతా ప్రజలు కారు...వారి ఇళ్ల నుంచి చెత్త ఎత్తించాల్సిన అవసరం లేదనుకుంటే..నేటి గ్రామసచివాలయ వ్యవస్థలో కూడా శానిటేషన్ సిబ్బందిని నియమించదు. అలాకాకుండా 14 మంది సిబ్బందితో గ్రామసచివాలయాల ద్వారా సేవలందిస్తున్నప్పుడు...చిన్న పంచాయతీలకు చెత్తఏరివేయడానికి శానిటేషన్ కనీసం ఆరుగురు వ్యక్తులనైనా చెత్త ఎత్తడానికి నియమించడానికి చర్యలు తీసుకుంటుంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి..!