ఎంతో నష్టపోయాం హోదా ఇవ్వండి..
Ens Balu
1
Tadepalle
2021-02-20 17:54:52
విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయిందని కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తే నష్టాన్ని పూడ్చుకునే వెసులుబాటు వస్తుందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కోరారు. శనివారంప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో జరిగిన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, పారిశ్రామికంగా వేగంగా ఎదగడం వంటివి ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’తోనే సాధ్యమవుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్పత్తి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సేవల డెలివరీ, ఆరోగ్యం, పౌష్టికాహారం అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఏపీలో కనీసం టయర్-1 నగరం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు-నేడు క్రింద కొత్తగా ఆసుపత్రులను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ‘భారత్ నెట్ ప్రాజెక్ట్ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కోసం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం చేసినట్లు వివరించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చించారు.