ఓటు హక్కు వినియోగించుకోవాలి..
Ens Balu
1
Srikakulam
2021-02-20 19:56:28
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సవాంగ్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనకు శని వారం విచ్చేసిన డిజిపి స్ధానిక సంస్ధల ఎన్నికలపై పోలీసు అధికారులతో సమీక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కీలకమన్నారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క అర్హమైన వ్యక్తికి ఓటు వేసుకునే సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటును వేసుకునే పరిస్ధితి ప్రస్తుతం తీసుకువచ్చామని అన్నారు. గత మూడు విడతలలో ప్రశాంతంగా పోలింగు జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడు విడతలలోనూ 80 శాతంకు పైగా పోలింగు నమోదు అయ్యిందని అన్నారు. జిల్లా యంత్రాగం, పోలీసు వ్యవస్ధ మంచి సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని కొనియాడారు. పోలీసులు మానవతా ధృక్పదంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు చేయూతను పోలీసు వ్యవస్ధ అందిస్తుందని చెప్పారు. కోవిడ్ సమయంలో పోలీసులు అందించిన సేవలు ఎనలేనివని డిజిపి అన్నారు. కోవిడ్ అనే భయంకరమైన మహమ్మారి ఏమి చేస్తుందో, ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్ధితుల్లో పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్డుపైకి వచ్చి ప్రజలను కాపాడటం బాధ్యతగా తీసుకుందని అన్నారు. ప్రజల కోసం పోలీసు వ్యవస్ధ నిలబడిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం పోలీసులు ప్రశంసనీయమైన మంచి సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిఐజి) ఎల్.కె.వి.రంగారావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, ఎఎస్పిలు పి.సోమశేఖర్, కె.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.