రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతం..
Ens Balu
2
Srikakulam
2021-02-20 20:01:59
రాష్ట్రంలో ఎన్నికలలో ప్రశాంతంగా ఓటింగు వేసే పరిస్ధితిని కల్పించామని రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సవాంగ్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనకు శనివారం విచ్చేసిన డిజిపి స్ధానిక సంస్ధల ఎన్నికలపై పోలీసు అధికారులతో సమీక్షించి తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కీలకమన్నారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క అర్హమైన వ్యక్తికి ఓటు వేసుకునే సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటును వేసుకునే పరిస్ధితి ప్రస్తుతం తీసుకువచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటును వేసుకునేందుకు పోలీసు వ్యవస్ధ సహాయకారిగా ఉంటుందని చెప్పారు. గత మూడు విడతలలో ప్రశాంతంగా పోలింగు జరిగిందని ఆయన అన్నారు. ఇదే పరిస్ధితిని కొనసాగించాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రతి రోజు డిఐజి, ఎస్.పిలతో జిల్లాల్లో పరిస్ధితులను గురించి, ఏర్పాట్లు, సంసిద్ధత గురించి మాట్లాడటం జరుగుతుందని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్.పి నేతృత్వంలో టీమ్ స్పిరిట్ తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. జిల్లా యంత్రాగం, పోలీసు వ్యవస్ధ మంచి సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని కొనియాడారు. ఎక్కడా సమస్యలు లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఒక వేళ సమస్య తలెత్తనా వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతున్నారని, ఇది శుభసూచకమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మంచి పాజిటివ్ వ్యక్తిత్వంతో మంచి సామర్ధ్యంతో ముందుచూపుతో పనిచేస్తున్నారని అభినందించారు. విజయవాడ మునిసిపల్ కమీషనర్ గాను మంచి సేవలు అందించారని చెప్పారు. పోలీసు వ్యవస్ధపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని డిజిపి అన్నారు. మానవతా ధృక్పదంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు చేయూతను పోలీసు వ్యవస్ధ అందిస్తుందని చెప్పారు. మనం చేసిన పనుల వలన ప్రజల అభిప్రాయం ఉంటుందని అన్నారు. ప్రజల కోసం పోలీసు పనిచేయాలని, పోలీసు అనేది సేవా ధృక్పధం గల వ్యవస్ధ అని తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా మంచి సేవలు అందించాలని సూచించారు. సర్వ్ ద సొసైటి బెటర్ అన్నారు. పోలీసు అధికారులు మంచి పర్యవేక్షణ చేసి క్రింది స్దాయి అధికారులు, సిబ్బందిలో స్ఫూర్తిని నింపాలని సూచించారు. ఇప్పటి వరకు బాగా చేసామని, భవిష్యత్తులో బ్రహ్మాండంగా చేయాలని అన్నారు.
కోవిడ్ సమయంలో సేవలు ఎనలేనివి : కోవిడ్ సమయంలో పోలీసులు అందించిన సేవలు ఎనలేనివని డిజిపి అన్నారు. కోవిడ్ అనే భయంకరమైన మహమ్మారి ఏమి చేస్తుందో, ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్ధితుల్లో పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్డుపైకి వచ్చి ప్రజలను కాపాడటం బాధ్యతగా తీసుకుందని అన్నారు. ప్రజల కోసం పోలీసు వ్యవస్ధ నిలబడిందంని చెప్పారు. కోవిడ్ లో 109 మంది పోలీసు అమరులు అయ్యారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం పోలీసులు ప్రశంసనీయమైన మంచి సేవలు అందించారని కొనియాడారు. జిల్లా యంత్రాగం సైతం అండగా నిలబడిందని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్.పి అమిత్ బర్దార్ చక్కగా పనిచేసారని అన్నారు. డిప్యూటి ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిఐజి) ఎల్.కె.వి.రంగారావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల మూడు దశలలో కేవలం 22 కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. గతంలో 87 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లా యంత్రాగం, పోలీసు మద్య జిల్లాలో మంచి సమన్వయం ఉందన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి చక్కని పనితీరు ప్రదర్శించారని చెప్పారు. డిజిపిగా చక్కని ప్రేరణ కలిగిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది మంచి పనిచేయుటకు ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. అనాధ శవాన్ని మోసిన పలాస ఎస్.ఐ శిరీషకు మరుచటి రోజున పిలిచి అభినందించడం ప్రోత్సాహానికి మచ్చుతునక అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికలను చక్కగా నిర్వహించామని, నాలుగవ విడత ఎన్నికలను సైతం చక్కగా నిర్వహిస్తామని అన్నారు.
పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేస్తూ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నాటు సారాను అరికట్టడం వంటి విషయాలలోను ప్రత్యేక దృష్టిసారించామని అన్నారు. ఈ సందర్భంగా మూడు విడతలలో చక్కటి సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను డిజిపి పంపిణీ చేసారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఎస్.ఇ.బి ఎ.ఎస్.పి కె.శ్రీనివాస రావు, డిపిటిసి డి.ఎస్.పి జి.శ్రీనివాస రావు, ఇచ్చాపురం సిఐ ఎం.వినోద్ బాబు, పాతపట్నం సి.ఐ రవిప్రసాద్, ట్రాఫిక్ ఎస్.ఐ ఎం.లక్ష్మణ్, విమెన్ పోలీసు ఎం.సరోజిని, ఎ.ఎస్.ఐ కె.కాంతయ్య, కానిస్టేబుల్ పి.రమణ, ఎం.నరసింహ మూర్తి, ఎస్.ఇ.బి ఎస్.ఐ కె.కృష్ణారావు, కానిస్టేబుల్ అబ్దుల్ ఖలీమ్., గ్రామ సచివాలయ సిబ్బంది టి.దుర్గా భవాని (ఉణుకూరు), గాయత్రి (కొత్తూరు), సూర్యకుమారి (ఇచ్చాపురం), డి.మధుబాల (పాతపట్నం) ఉన్నారు. సీతంపేట ప్రాంతంలో మద్యం నివారణలో పనిచేస్తున్న ప్రేరణ బృందంతో డిజిపి మాట్లాడుతూ అబినందించారు. అంతకముందు ఎచ్చెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోగల పోలింగు కేంద్రాన్ని డిజిపి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పిలు పి.సోమశేఖర్, కె.శ్రీనివాస రావు, డి.ఎస్.పిలు శ్రావణి, ఎన్.ఎస్.ఎస్.శేఖర్, జి.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.