సచివాలయ సిబ్బంది వ్యవహారంపై నిఘా..


Ens Balu
1
Tadepalle
2021-02-21 10:22:26

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయ ఉద్యోగుల విధినిర్వహణపై నిఘాపెట్టింది. ఎవరు ఏవిధంగా విధినిర్వహణ చేస్తున్నారనే విషయమై తెలుసుకునేందుకు ఈ శాఖకు చెందిన జాయింట్ కలెక్టర్లు ఆకస్మికంగా సచివాలయాలను తనిఖీలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయి సుమారు 16నెలలు కావస్తున్నా నేటికీ చాలా మంది సచివాలయ సిబ్బందికి వారి డ్యూటీ చార్టును ఏవిధంగా అమలు చేయాలో కూడా తెలియడం లేదు...కాదు కాదు తెలిసినా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. దీనితో గ్రామాల్లో ప్రజల సమస్యలు ఎక్కడవి అక్కడే వుంటున్నాయి. అంతేకాకుండా సచివాయలయంలో ఇప్పటి వరకూ ఎన్ని శాఖల సిబ్బంది ఉన్నారు, వారు ఏ సమస్యలు పరిష్కారం చేస్తారు, ప్రజలు ఎవరిని ఏ సమస్య కోసం కలవాలి అనే విషయమై కనీసం గ్రామవాలంటీర్ల ద్వారా కూడా అవగాహన చేపట్టే కార్యక్రం చేపట్టడం లేదు. సిబ్బంది ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నా ప్రభుత్వం జీతాలు మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తుంది.  ఇదే సమయంలో గ్రామసచివాలయ వ్యవస్థపైనా, కొన్ని ప్రాంతాల్లోని గ్రామవాలంటీర్ల సేవలపైనా నిఘా వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాయని సమాచారం ఆ నివేధికలో చాలా పంచాయతీల్లో కార్యదర్శిలు వాలంటీర్లను, ఇతర శాఖ సిబ్బందిని కార్యాలయానికే పరిమితం చేసి ఉంచడంతో గ్రామంలో ప్రధాన సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయినట్టు నివేదించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పారిశుధ్యం, మంచినీటి ట్యాంకుల పరిశుభ్రత, వీధి దీపాలు, సంక్షేమ పథకాలు రాని వారి దరఖాస్తులను మండల కేంద్రాలకు పంపకపోవడం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గ్రామంలో గొడవలపై చర్యలు తీసుకోకపోవడం, భూ ఆక్రమణలపై ద్రుష్టిపెట్టకపోవడం తదితర వ్యవహారాలన్నింటిపైనా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులపై నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది. దీనితో గ్రామసచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయడానికి, ఉద్యోగుల డ్యూటీ చార్టు అమలు చేయడానికి గ్రామసచివాలయశాఖ జాయింట్ కలెక్టర్లుతో  చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమారం. అదే సమయంలో బాగా పనిచేసే గ్రామసచివాలయ సిబ్బందిని ఉత్తేజపరుస్తూ వారి సేవలను ప్రజలకు మరింతగా అందించే కార్యక్రమం కూడా చేపట్టనున్నారని తెలుస్తుంది. గ్రామసచివాలయశాఖ జెసిలు రంగంలోకి దిగితే తప్పా ఆడుతూ, పాడుతూ పనిచేస్తూ కార్యాలయాలకే పరిమితమయ్యే సచివాలయ సిబ్బంది వ్యవహరం ఒక కొలిక్కిరాదు. అదేసమయంలో కొన్ని పనులకు సంబంధించి చేయితడుపుడు వ్యవహారాలు, చేసిన గోరంత ఖర్చుకి కొండంత నకిలీ బిల్లులు సమర్పించే కార్యదర్శిలపై వేటు తదితర చర్యలను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండంలోని ఒక ఈఓపీఆర్డీ, మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలపై వేటు వేసే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. వారిని సస్పెండ్ చేస్తారో, విధుల నుంచి తప్పిస్తారోననే ఉత్కంఠ ఇప్పటికే నెలకొనగా, పనిచేయని సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం, నిఘావర్గాలు ద్రుష్టిపెట్టారనే సమాచారం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.